మహబూబ్ నగర్ నియోజకవర్గం పరిధిలో డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీ వ్యవహారంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దారుగా గతంలో పనిచేసిన ఓ అధికారి కార్యాలయ సిబ్బంది, ఆర్ ఐ తో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెళ్లి చెప్పి సిబ్బంది సహకారంతో మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్ అక్రమాలకు తెర లేపాడు. ఒక్కొక్కరి నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మూడు లక్షల చొప్పున మొత్తం పదిమంది డబ్బులు చెల్లించినట్లు చెబుతున్నారు. నాలుగిండ్ల కోసం 15 లక్షల రూపాయలు చెల్లించి మోసపోయినట్టుగా వెంకటేష్ మరికొందరితో కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గం పరిధిలోని దివిటిపల్లి, మౌలాలిగుట్ట, వీరన్న పేట, క్రిస్టియన్ పల్లి, ఏనుకొండ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. పథకం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అమలుకు వచ్చేసరికి అక్రమాలు చోటుచేసుకున్నాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత పంపిణీ ప్రక్రియలో నిర్దిష్టమైన నిబంధనలు పాటించకపోవడం అర్బన్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి అస్త్రంగా మారింది. ఇంటికో రేటు ఫిక్స్ చేసి దందాకు తెరలేపారు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది. బ్యూటీ పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలంటే ఏకంగా ఆరు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో జరిగిన అక్రమాలపై డబ్బు చెల్లించి నష్టపోయిన వారు జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ జరుగుతుందని భావించిన బాధ్యతలు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు జరిగిన అన్యాయం గురించి సీఎం వద్ద గోడు వెల్లబోసుకున్నారు. దీంతో సీఎం కార్యాలయ అధికారులు మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది చేతివాటంపై రహస్యంగా విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం మారింది. టిఆర్ఎస్ గద్దె దిగి కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. ఇదే జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎం పీఠంపై కూర్చున్నారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగినప్పుడు విధులు నిర్వహించిన అధికారులు కూడా ప్రస్తుతం బదిలీ అయ్యారు. అయితే అప్పట్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి తమకు నష్టాన్ని సరిచేయాలని బాధితులు కోరుతున్నారు.
Discussion about this post