ప్రపంచంలోనే అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం.. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. దక్షిణ అమెరికాలో తొమ్మిది దేశాలకు విస్తరించిన అడవులు ఇవి. ఈ భూ మండలం మొత్తానికి ఆక్సిజన్ అందించే ” ఊపిరితిత్తులు”గా ఈ అమెజాన్ ఫారెస్ట్ ని అభివర్ణిస్తారు. లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన చిత్తడి నేల..ఇక్కడ ఏడాది పొడవునా వర్షం కురుస్తుంది. బ్రెజిల్‌లో 60 శాతం మేర అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి. బొలీవియా, ఈక్వెడార్, ఫ్రెంచ్ గయానా, గయానా, సురినమె, వెనిజులాలోనూ అమెజాన్ అడవుల జాడలు ఉన్నాయి. 20 నుంచి 30 శాతం మేర ఆక్సిజన్ ఇక్కడి నుంచే అందుతుందనేది సైంటిస్టుల అంచనా.
అమెజాన్ అడవుల్లో ఏడాది పొడవునా అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటుంది. అలాంటి అమెజాన్ అడవుల్లో ఉష్ణోగ్రత రికార్డుస్థాయికి చేరుకోవడంతో డాల్ఫీన్ లు మృత్యు వాత పడుతున్నాయి.
ఇటీవల కొంత కాలంగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు పైగా ఉంటోంది అంటే సుమారు 100 నుంచి 102 ఫారెన్‌హీట్‌గా ఉంటోంది. ఇంతటి భారీ వాతావరణం ఇక్కడి జీవజాలానికి విషంగా తయారయ్యింది. ప్రత్యేకంగా ఈ వాతావరణం డాల్ఫీన్స్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ వాతావరణం వలన డాల్ఫిన్లు మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో వందకు పైగా డాల్ఫిన్లు మరణించాయి. అప్పర్ అమెజాన్ నదీ తీరంలో ఉన్న లేక్ టెఫెలో డాల్ఫిన్ల మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి..మమిరువా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో ఓ బృందాన్ని ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది బ్రెజిల్ ప్రభుత్వం .
వందకు పైగా డాల్ఫిన్ల మరణానికి వాతావరణ మార్పులే కారణమని ఈ బృందం నిర్ధారించింది. ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోవడం వల్ల ఈ ప్రాంతం అంత చాలావరకు ఎండిపోయిందని ధృవీకరించింది. ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత నమోదుఅవుతోంది. దీని కారణంగా ఈ ప్రాంతం మొత్తం కరవుకు దారి తీసే ప్రమాదం ఉందని అంచనా వేసింది. మిగిలిన డాల్ఫిన్లను సంరక్షించడానికి చర్యలు చేపట్టింది బ్రెజిల్ ప్రభుత్వం. కొన్ని అరుదైన మొక్కలు సైతం ఎండిపోతున్నట్లు సైంటిస్టులు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఇంకా ఎక్కువ రోజులు కొనసాగితే భారీ నష్టం తప్పదని మమిరువా ఇన్‌స్టిట్యూట్ రీసెర్చర్ ఆండ్రె క్యోల్హో అభిప్రాయపడ్డారు. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల అమెజాన్ ప్రాంతంలో లో కరవు ఛాయలు ఏర్పడ్డాయి.
Discussion about this post