అది ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి. దాన్నే పెద్దాసుపత్రి అని కూడా పిలుస్తారు. పేరుకు తగ్గట్టే అది చూసేవారికి పెద్దగానే కనిపిస్తోంది. కానీ ఆసుపత్రికి వచ్చే రోగులకు పేరుకు తగ్గ సేవలు అందించలేక పోతోంది. వసతులు ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది కొరత కారణంగా ఖమ్మం ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశతో ధర్మాసుపత్రికి వస్తోన్న రోగులు… సరైన వైద్య సేవలు లభించక నిరాశతో వెనుదిరుగుతోన్న దుస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం…
ఇదే ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి. చూడండి ఆసుపత్రి భవనం ఎంత పెద్దగా ఉందో… ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కువ మంది మంత్రులైంది కూడా ఈ జిల్లా నుంచే. ముగ్గురిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కూడానూ. ముగ్గురు మంత్రులుగా కొనసాగుతోన్న ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత వేదిస్తోంది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి ఎవరైనా క్రిటికల్ కేర్, ట్రామా వైద్యం కోసం వస్తే ఇక అంతే సంగతులు. గుండె, న్యూరో సంబంధిత విభాగాల్లో వైద్యులే లేరు. మరి ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రిలో గుండె, న్యూరోకు సంబంధించిన సదుపాయాలు లేవా…? అంటే… అన్నీ ఉన్నాయి. కానీ ఆ సదుపాయాలు రోగులకు అందాలంటే… వాటిని అందించే వైద్యులు మాత్రమే లేరు. వాటిని అందించాల్సిన వైద్యులు లేనప్పుడు… సదుపాయాలు ఉండి ఏం లాభం? ఇది ప్రధానమైన గుండు, న్యూరో విభాగాలకు సంబంధించిన పరిస్థితి.
పోనీ ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రికి రోగులు రావడం లేదా…? అంటే… భారీగానే వస్తుంటారు. కానీ తీరా ఆసుపత్రికి వచ్చాక వైద్య సదుపాయాలు అందక నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం క్రిటికల్ కేర్, ట్రామా విభాగం ఏర్పాటు చేసిన తర్వాత ఇతర జిల్లాల నుంచి వైద్యులకు ఇక్కడికి డిప్యుటేషన్ పద్దతిలో తీసుకొచ్చారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో డిప్యుటేషన్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా డిప్యుటేషన్ పై ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చిన వైద్యులు… డిప్యుటేషన్ విధానం రద్దు కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.
పెద్దాసుపత్రిలో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందక రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులన్నా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు లేకపోవడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ఎమర్జెన్సీ విభాగంలో వైద్యుల కొరత తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం డిప్యూటేషన్ రద్దు చేయడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు తలనొప్పిగా మారింది. ఇతర శాఖల కంటే వైద్య శాఖల్లో డిప్యూటేషన్ రద్దు చేసే సమయంలో ఆస్పత్రికి ఇతర వైద్యులను నియమించి ఉంటే ఉంటే సమస్య ఇంతగా ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎమర్జెన్సీ విభాగం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వైద్యున్ని నియమించిన తర్వాత డిప్యుటేషన్ రద్దు చేస్తే బాగుండేదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. జ్వరాలతో వచ్చే రోగులకు కూడా ఆసుపత్రిలో సరైన సేవలు అందడం లేదు.
ఇక ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రికి వచ్చే గర్జిణీ స్త్రీలు, బాలింతలు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్బిణీ స్త్రీలు, బాలింత తల్లులకు మెరుగైన సేవలు అందిస్తూ… వారికి తగిన సలహాలు, సూచనలు చేయాల్సిన సిబ్బంది… అందుకు భిన్నంగా వారితో దురుసుగా మాట్లాడుతున్నారనే విమర్శలున్నాయి.
ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని సిబ్బందిని పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పేదలకు అందాల్సిన వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందక పోవడంతో.. వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నాని చెబుతున్నారు. పరీక్షల నిర్వహణలోనూ, మందులు ఇచ్చే విషయంలోనూ రోగులకు సరైన న్యాయం జరగడం లేదని ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రిలో రోగులు పడుతున్న విషయాన్ని, వైద్య సిబ్బంది కొరతను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నాకర్ దృష్టికి తీసుకెళ్లింది ఫోర్ సైడ్స్ టీవీ. అయితే ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నాకర్… ఉన్న సిబ్బందితో సాధ్యమైనంత మేర మెరుగైన సేవలే అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవల్లో ఎలాంటి తేడా లేదని… అయితే రోజుకు వందల సంఖ్యలో వచ్చే రోగులను చూసేందుకు ఇద్దరు మాత్రమే వైద్యులున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కారణంగా రోగులు ఎదుర్కొంటున్న సమస్య. పెద్దాసుపత్రి ఉండీ, ఆసుపత్రిలో వసతులు కూడా ఉండి… సిబ్బంది కొరత కారణంగా సమస్య తలెత్తుతోంది. ఇప్పటికైనా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకుని సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటే… చాలా మంది పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
Discussion about this post