టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్… ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే.
కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన ఓం ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించగా… ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక సార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది. ఈ సినిమా కోసం అండర్ వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నేరస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో ఓం చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది.
1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో ఓం డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా 10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ ఓంకారమ్ పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో అర్జున్‌పండిట్ పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు.
Discussion about this post