తెలంగాణలో నకిలీ మెడిసిన్ దందా సాగిస్తున్న ముఠా గుట్టును డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రట్టు చేసారు. ముఠా సభ్యులను పట్టుకుని 26 లక్షల రూపాయల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్‌టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ చికిత్సలకు వాడే మందులు ఉన్నాయి.
నకిలీ మందుల దందాపై సమాచారం అందడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఉత్తరాఖండ్ నుండి తెలంగాణలోకి నకిలీ మెడిసిన్ తరలిస్తున్న ముఠాను పట్టుకుంది. ట్రాకాన్ కొరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొరియర్ షిప్పింగ్ కంపెనీ ద్వారా హైదరాబాద్‌కు నకిలీ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు గుర్తించింది. ఉత్తరాఖండ్‌లోని అమర్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా నకిలీ డ్రగ్స్ బుక్ చేసినట్లు గుర్తించింది.
అధిక కొలెస్ట్రాల్ చికిత్సలో ఉపయోగించే రోసువాస్ 10 టాబ్లెట్లు, హైపర్‌టెన్షన్ చికిత్సలో వినియోగించే టెల్మా మాత్రలు, రెండు రకాల యాంటీబయాటిక్స్ నకిలీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 26 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.
Discussion about this post