రైతులను ప్రపంచంలోని మనుషులే కాదు… ప్రకృతి కూడా మోసం చేస్తుందనడానికి ఇప్పుడు కురుస్తున్న వర్షాలే నిదర్శనం… ఎండకాలంలో వానలు పడుతున్నాయి. ఎంతో శ్రమించి కోతకు వచ్చిన పంటలను వానలు ముంచుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలి… ఎలా చెప్పుకోవాలి… ఎవరిని నిందించాలి తెలియక సతమతమవుతున్నారు. అకాల వర్షాలతో తమ ఇళ్లు కొల్లేరవుతున్నాయని వాపోతున్నారు. ఇక గత కొన్ని రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నిజామాబాద్, కామారెడ్డిలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కామారెడ్డి జిల్లాలో కురిసిన ఆకాల వర్షాలకు రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను రైతులు కొనుగోలు కేంద్రాలలో ఉంచినా కూడా సరైన సమయంలో ప్రభుత్వం కొనకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నలకు అకాల వర్షాలు నష్ట0 మిగల్చగా, అటు ప్రభుత్వం, ఇటు అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు.
కామారెడ్డి జిల్లా లోని టెక్రియల్ గ్రామం లో కురిసిన భారీ వర్షానికి కళ్ళాలలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారుల దగ్గరికి వెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. గత 15 రోజుల నుండి వర్షాలు పడినా అటు ప్రభుత్వం గానీ, ఇటు జిల్లా అధికారులు సరైన సమయంలో స్పందించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలు చూసి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడిప్పుడు అప్రమత్తమౌతోంది .
రైతుల పంటలు చేతికొచ్చే వరకు ఒక ఎత్తయితే, కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట నీటి పాలవడం ఒక ఎత్తు. అధికారుల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పంట అమ్ముకోవడం గగనం అవుతోంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తాం అన్నా ఆ నష్టపరిహారం తాము చేసిన అప్పులకు ఏ పాటి సరిపోదని, తాము ముందే నష్ట పోయామని, ప్రభుత్వం ప్రకటించిన పరిహార0 ద్వారా కూడా తాము కోలుకోలేని దెబ్బ వర్షం తీసిందని రైతులు ఫోర్ సైడ్స్ టీవీతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
గత 15 రోజుల నుండి కురిసిన వర్షాల వల్ల పంట నష్టం కలిగిందని, తొందరగా ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినా ఇన్ని రోజులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడిప్పుడే తమ గురించి ఆలోచిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్షాన ఉంటామని చెప్పే ప్రభుత్వాలు రైతులు నిండా మునిగే వరకు తమ గోడును పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు.
Discussion about this post