విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో నంబర్ ప్లాట్ ఫారంపై నిలిపి ఉన్న కోర్బా – విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోని మూడు ఏసీ బోగీల్లో మంటలు చేలరేగాయి. తొలుత బీ-7 బోగీలో చేలరేగిన మంటలు క్రమంగా బీ-6, ఎం-1 బోగీలకు వ్యాపించాయి. ఇది గమనించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీనిపై అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. కోర్బా నుంచి ఉదయం ఆరు గంటలకు రైలు విశాఖకు వచ్చిందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వెళ్లాల్సి ఉందన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లు వెల్లడించారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి విడదీసి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అగ్నిప్రమాదం ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని విశాఖ సంయుక్త సీపీ ఫకీరప్ప తెలిపారు. రైలులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారని, ఉదయం 10 గంటలకు రైలులో మంటలు చెలరేగాయని చెప్పారు. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని వివరించారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలార్పారని పేర్కొన్నారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసి తరలిస్తున్నారని వివరించారు. అగ్నిప్రమాద ఘటనపై రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నట్లు ఫకీరప్ప వెల్లడించారు.
Discussion about this post