గగన్‌యాన్ మిషన్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో సక్సెస్ సాధించింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంలో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ తయారీలో కీలకమైన సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో ‘ఎక్స్’లో పోస్టు ద్వారా తెలియజేసింది.
క్రయోజనిక్ ఇంజన్ పూర్తి సంతృప్తికరంగా పనిచేసిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని ఇస్రో వెల్లడించింది. పలు కఠిన పరీక్షల తర్వాత క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని తెలిపింది. మానవ రహిత గగన్‌యాన్-1 యాత్రను ఈ ఏడాది నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే తర్వాతి దశలో మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు.
ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్‌యాన్ మిషన్ లక్ష్యం. ఈ మేరకు వ్యోమగాములను ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలు ఉంటాయి. క్రయోజనిక్ దశలో లాంచ్ వెహికల్‌ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్‌పై ఏడో వాక్యూమ్ టెస్టును ఫిబ్రవరి 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆల్టిట్యుడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది.
Discussion about this post