విశాఖపట్నం డ్రీం ప్రాజెక్టు పేరిట సీఎం జగన్ మోహన్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం సిగ్గుచేటని టీడీపీ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ విశాఖ తన కలల రాజధాని అంటూ సీఎం జగన్ అబద్ధాలు, బూటకపు మాటలు చెప్పారని ఆరోపించారు. గత ఐదేళ్లలో విశాఖకు ఏమీ చేయకపోగా సర్క్యూట్ హౌస్ తో సహా 128 ఎకరాల్లోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని చెప్పారు.
రుషికొండపై అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు 500 కోట్లు ఖర్చు పెట్టారని గంటా చెప్పారు. ఈ విషయంలో బ్యాంకులను కూడా మభ్యపెట్టారన్నారు. కేసుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారన్నారు.
విశాఖ నగర అభివృద్ధికి ఫినిషింగ్ టచ్ ఇస్తామని సీఎం జగన్ ఇప్పుడు చెప్పటమేమిటని మాజీ మంత్రి గంటా నిలదీశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజువాక నుంచి మధురవాడ వరకు 12 ఫ్లై ఓవర్లు కడతామని చెప్పిన జగన్ మాట తప్పారన్నారు. మరోవైపు ఎన్నో పరిశ్రమలను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టారన్నారు.
రాజధాని అమరావతిపై యూ టర్న్ తీసుకున్న జగన్.. మూడు రాజధానుల విషయంలో చేసిందేమిటని గంటా నిలదీశారు. కోర్టులంటే జగన్ కు లెక్కలేదన్నారు. ఎవరైనా కొత్త ప్రభుత్వం ఏర్పడినపుడు తమ విజన్ గురించి చెబుతారని గంటా అన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నపుడు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని చేసినప్పటికీ విశాఖపట్నం ప్రజలు జగన్ ను నమ్మబోరని చెప్పారు. గత రెండు ఎన్నికల్లోనూ విశాఖ ప్రజలు తమ వైఖరిని స్పష్టం చేసారని వివరించారు.
Discussion about this post