కన్నుల పండుగగా సర్వదేవతాలంకరణ
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఘనంగా సర్వదేవతాలంకరణ కార్యక్రమాన్నినిర్వహించారు. సర్వదేవతాలంకరణ లేదా విశ్వరూప సేవ గా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈఓ రమాదేవి జ్యోతి వెలిగించి వేదమంత్రోచ్చారణల మధ్య లాంఛనంగా ప్రారంభించారు. డిసెంబర్ 23న జరిగిన ముక్కోటి ఏకాదశి తర్వాత 16 వ రోజున బహుళ ద్వాదశి నాడు నిర్వహించే విశ్వరూప సేవను ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా జరిపించారు.
రామాలయం లోని ఉత్సవ మూర్తులతో పాటు ఉపాలయాల్లోని 108 దేవతా మూర్తుల విగ్రహాలను ఒక్కచోట చేర్చి అలంకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలతో రామనామ స్మరణల మధ్య వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని తలపించేలా ఈ విశ్వరూప సేవ ను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ప్రత్యేక దర్బారు,వేద విన్నపాలు,హరిదాసుల గానాలు, దివిటీల సలాం,విశేష అర్చనతో జరిగిన విశ్వరూప సేవ కన్నుల పండుగగా సాగింది. జయ జయ రామ నామ స్మరణలతో,ధూపాలతో రామాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కదంబ నివేదనం,మంత్ర పుష్పంతో విశ్వరూప సేవ పరిసమాప్తమైంది.
Discussion about this post