వీసా గడువు ముగిసిపోయినప్పటికీ తమ దేశంలో అక్రమంగా ఉంటున్నవారు ఎలాంటి జరిమానా కట్టకుండా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు కువైట్ ప్రభుత్వం మరోమారు ఆమ్నెస్టీ అంటే క్షమాభిక్ష ప్రకటించింది. మార్చి 18 నుంచి అమల్లోకి వచ్చిన ఈ క్షమాభిక్ష జూన్ 17 వరకు మూడు నెలలపాటు ఉంటుంది. బాధితులు కువైట్‌లో ఉన్న రాయబార కార్యాలయాల్లో అప్లికేషన్లు పెట్టుకుంటే స్వదేశానికి వెళ్లిపోవడానికి అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం కువైట్లో లక్ష మందికి పైగా భారతీయ యువతీ యువకులు అక్రమంగా ఉంటున్నారు. ఇప్పుడు వీరందరికీ మంచి అవకాశం లభించినట్లయింది.
తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు దుబాయ్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ లాంటి దేశాలకు వెళుతుంటారు. కొంతమంది ఏజెంట్లు టూరిస్ట్ వీసాలపై వీరిని పంపించేస్తుంటారు. ఆలా వెళ్లి ఉండటం తప్పని తెలిసినప్పటికీ.. తిరిగి వెనక్కి వెళ్లడానికి డబ్బుల్లేక రహస్యంగా బతుకుతుంటారు. ఇంటికెళితే ఇంత డబ్బు సంపాదించలేమని ఎలాగోలా బండి నడిపిస్తుంటారు. కరోనా సమయంలో 2020లో కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించినప్పుడు వేల మంది తిరిగివచ్చారు.
కువైట్ వెళ్లినవారిలో చాలామంది స్పాన్సరర్లు, యజమానులతో విభేదించి, జీతాలు లభించక వారి వద్ద నుండి వెళ్లిపోయి చట్టవిరుద్ధంగా నివాసం ఉంటారు. కొందరు వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడుపుతుండగా మరికొందరు ఉద్యోగాలు దొరకక, దిక్కుతోచని స్థితిలో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. తినడానికి తిండిలేక, విమాన ప్రయాణానికి డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారు. చిల్లి గవ్వ లేకుండా ఇంటికి తిరిగి వెళ్లలేక సతమతమవుతున్నారు. విదేశానికి రావటానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మగ్గిపోతున్నారు. ఇప్పుడు వీరందరికీ కువైట్ ప్రభుత్వం చల్లని వార్త చెప్పింది.
యజమానుల చిత్రహింసలను తట్టుకోలేక వారి వద్దనే పాస్ పోర్టులు వదిలేసి పారిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. తాత్కాలిక పాస్ పోర్ట్ కోసం భారత ఎంబసీ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయినప్పటికీ తమ గోడు పట్టించుకునే నాధుడే లేడని పలువురు వాపోతున్నారు. యజమానుల వద్ద ఉండిపోయిన పాస్ పోర్టులను తిరిగి ఇప్పించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ సమస్యపై కువైట్ లోని తెలుగు కళాసమితి అధ్యక్షుడు పొత్తూరు పార్థ సారధి, సోషల్ వర్కర్ అజీజ్ లతో ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి జమీల్ ఫోన్లో మాట్లాడారు. అక్కడి వాస్తవ పరిస్థితిని వారు సమగ్రంగా వివరించారు. సమస్య పరిష్కారానికి ఫోర్ సైడ్స్ టీవీ చేస్తున్న కృషికి సహకరిస్తామని వారు చెప్పారు. కువైట్ లోని భారత ఎంబసీపై ప్రభుత్వాలు, మీడియా ఒత్తిడి తెస్తే బాధితులకు ఊరట లభిస్తుందని అన్నారు.
Discussion about this post