పెనుగంచిప్రోలు తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. అమ్మవారి ఆలయం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవ విగ్రహాలను ఉంచి వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నందిగామ ఎసిపి రవికిరణ్ దంపతులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
స్వామివారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు తహతహలాడతారు. స్వామి – అమ్మవారి నుదుటిపై జాలు వారే ముత్యాల తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని వారి విశ్వాసం. ఈ తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ప్రతి ఏడాది పెరుగుతోంది.
అక్షతలు అంటే శాశ్వతమైనవని, నశించిపోని సుఖాలను కలుగజేసేవని పండితులు చెబుతున్నారు. వధూవరులు జీవితాంతం ఒకరికొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని అయ్యవార్లు చెబుతున్నారు. ఆది దంపతులైన శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ శిరస్సుపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలు ఎంతో శుభప్రదమైనవని భక్తుల విశ్వాసం.
ముత్యం చంద్రునికి గుర్తు. చంద్రుడు మనసుకు అధిపతి. మనసుకు ప్రశాంతత కలిగించేవాడు చంద్రుడు గనుక అతడికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారు. ఆలుమగల దాంపత్యం మనసుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా ముత్యాలు కలిపిన తలంబ్రాలను శిరస్సుపై పోసుకోవడం ద్వారా వారి మధ్య మరింత అనురాగం పెంపొందుతుందని, అన్యోన్యంగా జీవించడానికి ప్రతీకగా పెనుగంచిప్రోలు లోని ముత్యాల తలంబ్రాలను శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తిరుకల్యాణోత్సవంలో ఉపయోగిస్తామని పండితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సతీసమేతంగా వెళ్లి సమర్పించారు.
ఎమ్మెల్యే ఉదయభాను దంపతులు, ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు, ఈవో రమేష్ నాయుడు, అమ్మవారి వంశీయులైన కొల్ల రఘురామయ్య దంపతులు పట్టువస్తాలు సమర్పించి పూజ క్రతువును నిర్వహించారు. కళ్యాణం వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. నందిగామ ఎసిపి రవికిరణ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Discussion about this post