దేశ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంరక్షణ అందించటానికి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నేషనల్ హెల్త్ మిషన్ నిధులు ఆంధ్రప్రదేశ్ లో పక్క దారి పట్టాయి. ఈ ఆర్ధిక అవకతవకలకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిణి బాధ్యురాలని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు, సీబీఐకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వచ్చిన లేఖతో డొంక కదిలింది. అయినప్పటికీ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిణిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఫలితంగా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యమని చెబుతున్న ప్రధాని మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిణికి మహా స్ట్రిక్ట్ అని గొప్ప పేరుంది. అందరూ అది నిజమే అనుకుంటుంటారు. ఆ ఐఏఎస్ పేరు పూనమ్ మాలకొండయ్య. కానీ.. నాణేనికి రెండో వైపు ఉన్నట్టే ఈమెలో అపరిచితురాలు ఉన్నారని ఆమె గురించి పూర్తిగా తెలిసిన అతికొద్దిమంది చెబుతుంటారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్ కు మళ్లించిన విషయంలో ఆమె అడ్డంగా దొరికిపోయారు. దీనిలోంచి బయటపడటానికి నానా తిప్పలు పడ్డారు. చివరికి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బయటపడ్డారు. తర్వాత ఆమెను ఏకంగా సీఎంఓలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమించడం విస్మయం కలిగిస్తోంది.
విశాఖపట్నంలోని నడుపూరు గ్రామం వద్ద 270 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ దేశంలో మొట్టమొదటి మెడికల్ డివైజ్ పార్క్‌గా 2016లో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం ఉంది. మెడిటెక్ జోన్ అభివృద్ధి బాధ్యతను పవర్ మెక్ బి.ఎస్. సి. పీ.ఎల్. అనే ప్రైవేట్ కన్సార్టియం చేపట్టింది. వాస్తవానికి తొలుత లగడపాటి రాజగోపాల్ సంస్థకు ఈ టెండర్ దక్కింది. తర్వాత ఏమి జరిగిందో కానీ ఆ టెండర్ రద్దయింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ గా, నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ డైరెక్టర్ గా ఉన్నపుడు పూనమ్ మాలకొండయ్య నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 52 కోట్ల 78 లక్షల 48 వేల, 436 రూపాయలను 2018 నవంబర్ 20న పవర్ మెక్ బి.ఎస్.సి.పీ.ఎల్. కన్సార్టియంకు అడ్వాన్స్ గా చెల్లించేశారు. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, నేషనల్ హెల్త్ మిషన్ నిబంధనలకు పూర్తి విరుద్ధం.
Discussion about this post