గృహజ్యోతి పథకం కింద అర్హులైన విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో బిల్లులు యథాతథంగా వస్తుండటంతో లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఖమ్మంలో వినియోగదారుల కరెంటు బిల్లుల కష్టాలపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీ..
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గృహజ్యోతి పథకం కింద లబ్ది పొందటానికి ఖమ్మం జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ కొంతమందికి జీరో బిల్ రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జీరో బిల్లు రానివారు ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో మరోసారి అప్లికేషన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.
ఈ నేపథ్యంలో అసలు తమకు జీరో బిల్లు ఎందుకు రావడం లేదని వినియోగదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. డేటా ఎంట్రీలో తప్పులు చేయడం వల్లే ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల సూచన మేరకు ఉదయం నుండే మున్సిపల్ కార్యాలయంలోని హెల్ప్ డెస్కులో దరఖాస్తు చేసుకోవడానికి వందల సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఈ విషయంలో సరైన సమాచారం ఇచ్చే నాథుడే లేరని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్తు శాఖ అధికారులు తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Discussion about this post