విశాఖ పోర్టులో 25 వేల కిలోల మాదకద్రవ్యాలు దొరకడం విశాఖను గడగడ లాడిస్తోంది. వాటి విలువ రూ.50 వేల కోట్లు. 2021 ఫిబ్రవరిలో గుజరాత్ పోర్టు నుంచి 3,300 కేజీల మాదకద్రవ్యాలను భారత నావికా దళం, యాంటీ టెర్రరిజం స్క్యాడ్ సహకారంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో సీజ్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. గుజరాత్ లో పట్టుకున్న మాదకద్రవ్యాల విలువ రూ.2000 కోట్లు. 2023 మేలో 2,500 కిలోల మాదకద్రవ్యాలను కేరళ పోర్టు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంతపెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడుతున్నా సంబంధిత శాఖలు ఎందుకు అరెస్టులు జరపడం లేదు ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గుజరాత్ లో మాదకద్రవ్యాలు పట్టుబడినప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘చారిత్రాత్మిక విజయం’ దేశాన్ని మాదకద్రవ్య రహితంగా చేయడానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వీటిని నిరోధించేందుకు ఏం ప్రణాళికలు చేపట్టారో బహిర్గతం చేయలేదు.. ఇంత జరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తుండగా.. దీనివెనుక ఉన్న ఎంతటివారినైనా కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 2021 అక్టోబర్ 3న అరెస్టు చేశారు. అతను ప్రయాణించే షిప్లో 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండీ, 21 గ్రాముల చారస్, 22 ఎంఎండీఏ పిల్స్ దొరికాయని ఎన్సీబీ ప్రకటించింది. అక్టోబర్ 2న ముంబై బాంద్రాలోని తమ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఆర్యన్ ఖాన్.. స్నేహితులతో కలిసి సరదాగా గడపడం కోసం గోవా వెళ్లే కార్డిల్లా క్రూయిజ్ ఎంప్రెస్ షిప్ ఎక్కాడు. ఈ షిప్లో డ్రగ్స్ ఉన్నాయనే ముందస్తు సమాచారంతో.. అదోరోజు రాత్రి సోదాలు నిర్వహించి అతడిని అరెస్టు చేశారు.
షిప్ లో అతిచిన్న మొత్తంలో దొరికిన మాదకద్రవ్యాలకే అతన్ని, అతని స్నేహితులను అరెస్టు చేసి 26 రోజులపాటు జైల్లో ఉంచితే టన్నుల కొద్దీ మాదకద్రవ్యాలను అక్రమరవాణా చేసి పిల్లలు, యువతను సర్వనాశనం చేసే వారిపై ఎటు వంటి చర్యలు కాదుకదా… వారి పేర్లుకూడా బయటికి రావకపోవడంపై సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చీడపురుగులను ఏరి వేయాల్సి ఉండగా, ప్రభుత్వాలు ఉదాసీనంగా ప్రవర్తించడం పై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది.
ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు ప్రైవేటు పరం అయిన తర్వాత మాత్రమే టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు అక్రమరవాణా అవుతున్నాయని ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఆంథోని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై స్పందిస్తూ .. పోర్టులను ప్రైవేటు పరం చేశాక మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిందన్న దానిపై ఎటువంటి డేటా లేదని కొట్టి పారేశారు. ఆదాని ఆధ్వర్యంలోని ముంద్రా పోర్టు నుంచి 3 వేల కేజీలకు పైగా మాదకద్రవ్యాలు రవాణా కాగ, దీనిపై విచారణ చేపట్టలేదని ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి. దీనిపై జాతీయ విచారణ సంస్థ ఏం చెప్పిందన్న ప్రతిపక్షాలకు అధికార పక్షం సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను ఎవరు పంపారు ? ఎవరికి పంపారు అన్నది తెలియరాలేదు.
Discussion about this post