తెలంగాణలో..ఓ వైపు భానుడు సెగలు కక్కుతున్న వేళ.. అదే స్థాయిలో రాష్ట్రంలో పొలిటికల్ వేడి రాజుకుంటోంది. మాజీ మంత్రి, ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల సవాళ్లను చూస్తున్నాం…ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే తాను రాజీనామా చేస్తానని హరీశ్ ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆయన తన రాజీనామా లేఖతో గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. తాజాగా హరీశ్ మరో సవాలు విసిరారు.
బీఆర్ఎస్ పార్టీ 24 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో హరీశ్ రావు జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను తాను సిద్ధం చేస్తానని, సీఎం రేవంత్ కూడా రాజీనామా లేఖతో రెడీగా ఉండాలని.. వాటిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి పంపిద్దామని అన్నారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే తన రాజీనామా ఆమోదం పొందుతుందని, హామీలు అమలు కాకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. రాజీనామాలు బీఆర్ఎస్కు కొత్త కాదని, పదవుల్ని గడ్డి పోచల్లా విసిరేసిన చరిత్ర బీఆర్ఎస్కు ఉందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. 2002 ఏప్రిల్ 27న హైదరాబాద్ జలదృశంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నేడు దేశానికి ఆదర్శం అయిందని, బీఆర్ఎస్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసిందని చెప్పారు. రైతు బంధు పథకాన్ని బీజేపీ కాపీ కొట్టి అమలు చేసిందని, కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే దాక్కున్నారని చెప్పారు.
రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపరు ఇచ్చి తిరిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంటున్న రేవంత్ ఆగస్టు 15 లోగా రుణమాఫీ, గ్యారెంటీలు అమలు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తే మంత్రులు తిడుతున్నారని, మీ తిట్లను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానని, సిద్దిపేట జిల్లాను తొలగిస్తానని రేవంత్ అంటున్నారని, జిల్లాను ఓ సారి తొలగించి చూడు…. ప్రజలు స్పందన ఎలా ఉంటుందో అని హెచ్చరించారు. జిల్లాలు తొలగిస్తామంటున్న కాంగ్రెస్‌కు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని, హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ ఓడాల్సిందే అని హరీశ్ అన్నారు.
Discussion about this post