దసరా సినిమాతో మాస్ అవతారాన్ని చూపించిన నాని ఆ తర్వాత పూర్తి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో ముందుండే నాని శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో ‘హాయ్ నాన్న’ చేశారు. విడుదలకి ముందే నాని – మృణాల్ జోడీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
విరాజ్ పాత్రలో నాని నటించారు. విరాజ్ ఒక సక్సెస్ ఫుల్ ఫోటోగ్రాగర్. ముంబైలో ఒక స్టూడియో రన్ చేస్తూ తన ఒక్కగానొక్క కూతురు కియారా ఖన్నా..
తండ్రి లాంటి మరో వ్యక్తి తో కలిసి చాలా సంతోషంగా జీవిస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో ప్రవేశిస్తుంది మృణాల్ ఠాకూర్ పాత్ర.
విరాజ్ తన కూతురుతో నిర్మించుకున్న కలల ప్రపంచంలోకి వచ్చిన మృణాల్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? చివరికి ఏం జరిగింది? అనేది “హాయ్ నాన్న” కథాంశం.
ఈసినిమాలోని ప్రేమకథలో మలుపులు కొత్తగా ఉంటాయి. భావోద్వేగాలు హృదయాన్ని బలంగా హత్తుకుంటాయి.
చిన్నారి తన అమ్మగా కథానాయికని ఊహించుకోవడం మొదలైనప్పటి నుంచే ఈ కథ ఏ దిశగా సాగుతుందో ప్రేక్షకుడు ఓ అంచనాకి వస్తాడు.
అయినా సన్నివేశాలు ఓ ప్రేమకథకి కావల్సిన సంఘర్షణని పండిస్తాయి. భావోద్వేగాలు, మలుపులు సినిమాను మరోస్థాయిలో నిలబెడతాయి. ఆవిష్కరించిన ప్రేమలోనే కాస్తంత బలం తగ్గింది.
మృణాల్ విరాజ్‌తో ప్రేమలో పడటం, ఆ తర్వాత మహి ఎవరి కూతురు అనే మలుపు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. ద్వితీయార్ధంలో పండే భావోద్వేగాలతో మళ్లీ దర్శకుడు కథపై పట్టు ప్రదర్శించాడు.
తండ్రీ కూతుళ్ల పాత్రలలో పండిన భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్. అక్కడక్కడా నిదానంగా సాగే సన్నివేశాలున్నా కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఈ తరహా భావోద్వేగాలతో సినిమాలు ఈమధ్య కాలంలో రాలేదు.
ప్రేక్షకులకి వినోదం పంచడంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ సాధించింది.
నాని మరోసారి తన నటనతో ఆకట్టుకోవడమేకాదు.. హృదయాల్ని బరువెక్కించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది.
ఇద్దరూ చాలా బాగా నటించారు. ప్రేమ సన్నివేశాల్లోనూ, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ తన నటనతో కట్టిపడేసింది.
బేబి కియారా ముద్దు ముద్దుగా కనిపిస్తూ, కంటతడి పెట్టించింది. ప్రియదర్శి, అంగద్ బేది, జయరామ్, విరాజ్ అశ్విన్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. కథకి తగ్గ మంచి సన్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది.
శౌర్యువ్‌కి ఇదే తొలి సినిమా అయినప్పటికీ ఎంతో స్పష్టతతో, పరిణతితో సినిమాని తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
కథలోని భావోద్వేగాలు, మలుపులు, నాని, మృణాల్, బేబి కియారా నటన, సంగీతం, విజువల్స్ ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయని చెప్పవచ్చు..
Discussion about this post