జ్ఞానవాపి మసీదులో సెల్లార్లో ఉన్న దేవుళ్లకు పూజలు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. ఈ విషయంపై గతంలో వారణాసి కోర్టు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ముస్లింలు వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.
వ్యాస్ తెహఖానాలో హిందువుల ప్రార్థనలను కొనసాగుతాయని జస్టిస్ రోమిత్ రంజన్ అగర్వాల్ తెలిపారు. మసీదు కమిటీ వేసిన పిటీషన్‌ను ఆయన తిరస్కరించారు. వ్యాస్ తెహఖానా సెల్లార్లో హిందువులు పూజలు చేసుకునేందుకు గత నెలలో వారణాసి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. శైలేంద్ర కుమార్ పాఠక్ వేసిన పిటీషన్ ఆధారంగా గతంలో వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన తాతయ్య సోమనాథ్ వ్యాస్.. 1993 డిసెంబర్ వరకు జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేశారని ఆయన తన పిటీషన్లో తెలిపారు.
వారసత్వంగా పూజారిగా తనను తెహఖానాకు వెళ్లి పూజలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ శైలేంద్ర తన పిటీషన్లో కోరారు.కాశీ విశ్వనాథుడి ఆలయ పరిసరాల్లో ఉన్న జ్ఞానవాపి మసీదులో మొత్తం నాలుగు సెల్లార్లు ఉన్నాయి. అందులో ఒక సెల్లార్ ఇంకా వ్యాస్ ఫ్యామిలీ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. శైలేంద్ర కుమార్ వేసిన పిటీషన్‌ను మసీదు కమిటీ కొట్టిపారేసింది. సెల్లార్లో ఎటువంటి దేవతామూర్తులు లేరని ఆ కమిటీ పేర్కొన్నది. అందుకే 1993 వరకు అక్కడ ఎటువంటి పూజలు కూడా జరగలేదని మసీదు కమిటీ తెలిపింది. ఈ కేసులో వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదు కమిటీ సుప్రీంని ఆశ్రయించింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ పిటీషన్‌ను తిరస్కరిస్తూ.. హైకోర్టును ఆశ్రయించాలని కోరింది. ఫిబ్రవరి 15వ తేదీన ఇరు వర్గాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
Discussion about this post