ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణిస్తుంటే.. గాల్లో తేలినట్లుందని అంటుంటాం. కానీ, గతుకుల రోడ్లకు మించి కుదుపులు గాల్లోనే ఎక్కువ సంభవిస్తాయన్న విషయం తెలుసుకోవాలి. వీటి దెబ్బకు ఒక్కోసారి ప్రయాణికుల ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా సింగపుర్ ఎయిర్‌లైన్స్ విమానం ఇలానే కుదుపులకు లోనై ఓ ప్రయాణికుడు మరణించగా.. 30 మందికి పైగా గాయపడటం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు విమానాలు గాల్లో ఉన్నవేళ ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ మొదలైంది.
అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్నే ఎయిర్ టర్బులెన్స్ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేస్తుంది. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకొంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ, క్యుములోనింబస్ తుపాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి. విమానాలకు ముఖ్యంగా క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్ స్ట్రీమ్‌ల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరితలానికి 40 వేల నుంచి 60 వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకొంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్ స్ట్రీమ్‌లు ఉన్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్లో విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపుర్ ఎయిర్ లైన్స్ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకొంది. 35వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Discussion about this post