ఆర్ధికంగా, సామాజికంగా వెనుకపడి ఉన్నందున తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్న రాష్ట్రాలలో బీహార్, పంజాబ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్లు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు రాజ్యసభ సాక్షిగా డిమాండ్ చేసారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక దీని గురించి పట్టించుకోవడమే మానేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి ఉన్న నిబంధనలు ఏమిటి, ప్రస్తుత పరిస్థితి ఏమిటనే విషయాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
అయిదవ ఫైనాన్స్ కమీషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం 1969లో ప్రత్యేక హోదా విధానం అమల్లోకి వచ్చింది. రాష్ట్రాల వెనుకబాటు తనమే మొదట్లో దీనికి కొలబద్దగా ఉండేది. దీని ప్రకారం.. అసోం, నాగాలాండ్, మరో ప్రత్యేక కారణంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తర్వాత వివిధ అంశాల ప్రాతిపదికగా తర్వాత అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకూ ప్రత్యేక హోదా లభించింది. తొలుత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ హోదాను ఇచ్చేది. తర్వాత ఈ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది.
వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగటంతో ప్రత్యేక హోదాపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2013లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా 14 వ ఆర్ధిక సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలు, మూడు పర్వత ప్రాంత రాష్ట్రాలకు మినహా మిగిలిన రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేసింది. దీనికి బదులు రాష్ట్రాలకు ఇస్తున్న పన్నుల్లో వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ విధానం 2015 నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్లు గట్టిగా వస్తూనే ఉన్నాయి.
ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉండాలి. పర్వత ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలై ఉండాలి. సొంతంగా ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఆర్థిక పరిపుష్టత లేని ప్రాంతమై ఉండాలి. జనసాంద్రత తక్కువగా ఉంది గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉండాలి. సరైన మౌలిక సదుపాయాలు లేకుండా ఉండాలి.
రోజురోజుకీ ప్రత్యేక హోదా డిమాండ్లు పెరగటానికి దాని వల్ల కలిగే ప్రయోజనాలే కారణం.
ప్రత్యేక హోదా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30శాతం నిధులను తొలుత ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే ఇస్తుంది. కేంద్ర నిధులు 90శాతం గ్రాంట్ల కింద, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి కేంద్రానికి చెల్లించాల్సిన అవసరం ఉండదు. పరిశ్రమలకు సైతం భారీగా రాయితీలు లభిస్తాయి. కస్టమ్స్,ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ టాక్స్, ఆదాయ పన్నులో రాయితీలు లభిస్తాయి. వివిధ పథకాల కింద వచ్చిన నిధులను ప్రభుత్వాలు సకాలంలో ఖర్చు చేయకపోయినా అవి మురిగిపోవు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బదిలీ అవుతాయి.
పన్ను మినహాయింపులు, ప్రత్యేక రీయింబర్స్ మెంట్లు ఉంటాయి కనుక రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడతారు. పన్ను రాయితీలు, పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాల కారణంగా అనేక వస్తువుల ధరలు తగ్గుతాయి. కరెంటు సగం ధరకే లభ్యమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో పరిశ్రమలకు మేలు జరుగుతుంది. వీటితో పాటు అనేక పరోక్ష లాభాలను సైతం పొందవచ్చు.
ప్రత్యేక హోదా ఉన్న కారణంగానే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 2 వేల పరిశ్రమలు వచ్చాయి.
తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగినట్లు లెక్కలున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కారణంగా పది వేల పరిశ్రమలు కొత్తగా వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయి.
Discussion about this post