గత కొన్ని రోజులుగా పారిస్ ఒలంపిక్స్ చూడముచ్చటగా సాగాయి. మూడు వారాల పాటు కనులవిందు కలిగించాయి. ఆగస్ట్ 11తో ఎండ్ కార్డ్ పడింది . అంతర్జాతీయ పోటీల్లో ఈ సారి భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగగా అందరు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈసారి పతకాల సంఖ్య గతంలో (2020లో 7 పతకాలు) కన్నా ఒకటి తక్కువనే. మొత్తంగా భారత్ ఆరు పతకాలు సాధించగా, అందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి.
మను భాకర్ రెండు కాంస్యాలను సాధించింది. టోక్యోలో బంగారు పతకం నెగ్గిన నీరజ్ చోప్రా ఈసారి రజతంతో సరిపెట్టుకున్నాడు. బాక్సింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లలో భారత్ కు నిరాశ ఎదురైంది. కొన్ని ఈవెంట్స్ లో భారత ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాలను కోల్పోయారు. మహిళల రెజ్లింగ్ లో ఫైనల్ కు చేరిన వినేశ్ ఫోగాట్.. వెయిట్ ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటుకు గురైంది. ఫలితంగా భారత్ కు పతకం లభించలేదు. అయితే ప్రస్తుతం దీనిపై భారత్ అప్పీల్ చేసింది. త్వరలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.
ఈసారి ఒలింపిక్స్ లో భారత ప్రదర్శన నిరాశ పరిచింది. టోక్యో ఒలింపిక్స్ లో ఒక బంగారు పతకం.. రెండు రజతాలు.. నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పతకాలను సాధించింది. అప్పుడు భారత్ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కేవలం 6 పతకాలతో 71వ స్థానంలో కొనసాగుతుంది. ఈ స్థానం మరింత దిగజారే అవకాశం కూడా ఉంది.
ఈ ఒలింపిక్స్ కోసం భారత్ దాదాపుగా రూ. 420 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే భారత ప్లేయర్లు మాత్రం ఆశించిన స్థాయిలో పతకాలను సాధించలేకపోయింది. ఒలింపిక్స్ ముందు భారత్ 10 పతకాలను టార్గెట్ గా పెట్టుకుంది. అయితే దానిని సాధించలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ పతకాల ట్యాలీని కూడా సమం చేయలేకపోయింది. ముఖ్యంగా ఆశలు పెట్టుకున్న పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు పతకాలను సాధించడంలో విఫలం అయ్యారు.
ఒలింపిక్స్ 2024 – పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు వీరే..
1. మను భాకర్ – 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం
2. మను భాకర్, సరబ్జోత్ సింగ్ – 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం
3. స్వప్నిల్ కుశాలే – 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం
4. నీరజ్ చోప్రా – జావెలిన్ త్రోలో రజతం
5. అమన్ షెరావత్ – రెజ్లింగ్‌లో కాంస్యం
6. హాకీలో కాంస్యం
Discussion about this post