యూపీ లో బీజేపీ సత్తా చాటుతుందా ? లేదా ?అన్న విషయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. అక్కడ బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..అయితే బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో ఆశించిన ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు. యూపీ లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ..
2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాధించింది. 2019లో 62 సీట్లు గెల్చుకుంది.మిత్రపక్షం అప్నాదళ్ మరో రెండు స్థానాలను కైవసం చేసుకుంది.2014 తో పోలిస్తే 2019 లో 9 సీట్లు నష్టపోయింది.ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. 2019 నాటికి .. ఇప్పటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ తీసుకున్ననిర్ణయాలపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. పెట్రోల్, గ్యాస్ ధరల రెట్టింపు, నిత్యావసర ధరలపై నియంత్రణ లేకపోవడం.. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, నూతన వ్యవసాయ చట్టాలు, పెరిగిన రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు దేశ ప్రజలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే బీజేపీ ప్రాబల్యమున్న రాష్ర్టాల్లోనే ఆ పార్టీకి 2019 ఎన్నికలనాటి విజయం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం పూర్తి, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల సాకారం, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ముందడుగు, రేషన్ పొడిగింపు తదితర అంశాలతో.. ఈసారి ఎన్నికలను బీజేపీ చాలా సానుకూలంగా ప్రారంభించింది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి చెప్పుకొనేందుకు ఇన్ని ‘అవకాశాలు’ లేవు.అయినప్పటికీ ఈ అంశాలన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయగలవో చూడాలి. అదేసమయంలో మోడీ కి 2019 నాటి ఇమేజ్ లేదనే వాదన కూడా వినిపిస్తోంది. నాటితో పోలిస్తే విపక్షాలు కూడా కొంత బలపడ్డాయి. యూపీ లో ఈ సారి ఇండియా కూటమి బీజేపీ కి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. సమాజవాది పార్టీ యూపీ లో బలమైన పార్టీ .. అది కూటమి లో చేరడం కూటమి కి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇండియా కూటమి ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోరు జరగవచ్చని అంటున్నారు. రాహుల్ పాదయాత్ర ప్రభావం కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత కదలిక తెచ్చింది. అంతకు ముందుతో పోలిస్తే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి మిత్రులను కలుపుకుపోతున్నది.
Discussion about this post