హష్-మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను దోషిగా గుర్తిస్తూ న్యూయార్క్ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇన్నేళ్ల అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడు శిక్షకు గురవడం ఇదే మొదటిసారి. జూలై 11న ఆయనకు శిక్షను ఖరారు చేస్తారు. అక్రమ సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పోర్న్‌స్టార్‌కు ట్రంప్ డబ్బులు చెల్లించారని, అయితే ఆ చెల్లింపులను కప్పిపుచ్చేందుకు తన బిజినెస్ లెక్కల్లో తప్పుడు వివరాలు చూపించారన్న అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు తీర్పులో ఆయనను మొత్తం 34 ఆరోపణల కింద దోషిగా గుర్తించినట్లు న్యూయార్క్‌లోని మన్హటన్ క్రిమినల్ కోర్ట్ ప్రకటించింది. వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
12 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రెండు రోజులపాటు విచారణపై కసరత్తు చేసి ఏకాభిప్రాయంతో ఈ తీర్పును ప్రకటించారు. అయితే ఈ తీర్పునిచ్చిన జ్యూరీకి నాయకుడిగా వ్యవహరించిన జడ్జ్ మెర్ఖాన్పై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కేసులో న్యాయస్థానం 22 మంది సాక్షులను విచారించింది. మనీ చెల్లింపులలో కీలకమైన వ్యక్తి అయిన మాజీ నటి స్టార్మీ డేనియల్స్ కూడా ఉన్నారు. ఆరు వారాలపాటు ఈ విచారణ సాగింది. ఈ తీర్పుతో న్యాయం బతికే ఉందన్న విషయం అర్ధమైందని ట్రంప్ విమర్శకుడు, ఆయన ప్రత్యర్థి పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు ఆడమ్ స్కిఫ్ తన ఎక్స్ అకౌంట్లో కామెంట్ చేశారు. అయితే, బైడెన్ ప్రభుత్వం చేపట్టిన ఒక వేధింపు చర్యలో భాగమని, రాజకీయ ప్రేరేపితమని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ట్రంప్ అప్పీల్‌కు వెళ్లాలని అనుకుంటున్నప్పటికీ, హష్ మనీ కేసులో జులై 11న శిక్ష విధించనున్నారు. ఆయనకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లోనే రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు డోనాల్డ్ ట్రంప్ గట్టి పోటీఇవ్వనున్నారని, ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో ట్రంప్ కాస్త మెరుగైన స్థితిలో ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఆయన దోషిగా తేలారు.ట్రంప్ నేరం రుజువైతే ఆయనకు ఓటు వేయబోమని ఇటీవల నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో పలువురు ఓటర్లు చెప్పారు.
ఆయనకు ఏమాత్రం ప్రజల మద్దతు తగ్గినా ఫలితాలపై చాలా తేడా చూపిస్తుంది. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ వైపు చూడటానికి యువ ఓటర్లు వెనుకాడుతున్నారు. కానీ, చాలామంది రిపబ్లికన్లు ట్రంప్‌కు అండగా నిలిచారు.
అమెరికా చరిత్రలో ఇదొక అవమానకర దినం అని హౌజ్ స్పీకర్ మైక్ జాన్సన్ అన్నారు.
2016లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ఆయనపై అనేక కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని తారుమారు చేయగల అరోపణలు అవి. అయినప్పటికీ, ఆయన చెక్కు చెదరలేదు. ట్రంప్ రాజకీయ పతనం గురించి ఎనిమిదేళ్లుగా ఆయన ప్రత్యర్థులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు కూడా అలా జగలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు అభిశంసనలను ఎదుర్కొన్నప్పుడు, పదవి చివరి యూఎస్ క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారుల గుంపు దాడి చేసినప్పుడు కూడా పార్టీ ఆయన వెంటే నిలిచింది. ఈ ఘటనలేవీ ఆయనను మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేదు. అయితే, హష్ మనీ కేసులో దోషిగా తేలడంతో ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Discussion about this post