మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 2వ తేదీన మొదలుకానున్న ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల వరకు యూఎస్ఏలో, మిగిలిన మ్యాచ్‌లన్నీ కరేబియన్ దీవుల్లో జరగనున్నాయి. అయితే ప్రపంచకప్ ఆరంభం కాకముందే భారత అభిమానుల్లో వరల్డ్ కప్ హీట్ మొదలైంది. ప్రపంచకప్ భారత జట్టుకు ఏ ఆటగాళ్లు ఎంపిక అవుతారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. దాదాపు పది మంది ఆటగాళ్లు ఖరారైనప్పటికీ మిగిలిన అయిదు స్థానాల కోసం ప్లేయర్ల మధ్య విపరీతమైన పోటీ పెరిగింది. దీంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం టీమిండియా ఎంపిక గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింక ముందే మాజీ ఆటగాళ్లు తమ ప్రిడిక్షన్ టీమ్‌ను వెల్లడిస్తున్నారు. 15 మందితో కూడిన టీమిండియాను ఎంపిక చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ చేరాడు. అయితే అతను ఎంపిక చేసిన జట్టులో విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో వెలుగులోకి వచ్చిన కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్‌కు మంజ్రేకర్ అవకాశం ఇచ్చాడు. అలాగే శుభ్‌మన్ గిల్‌కు మొండిచేయి చూపించి, బ్యాకప్ ఓపెనర్ బ్యాకప్ వికెట్‌కీపర్‌గా సంజు శాంసన్, కేఎల్ రాహుల్‌లను ఎంపిక చేశాడు. కాగా, విధ్వంసకర బ్యాటర్లు శివమ్ దూబె, రింకూ సింగ్‌కు మంజ్రేకర్ సెలక్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ వ్యాఖ్యాత ఎంపిక చేసిన జట్టులో ఆల్‌రౌండర్ల స్థానాల్లో రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య మాత్రమే ఉన్నారు. మంజ్రేకర్ జట్టును చూసాక, ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్నావనే, ఒకప్పుడు రవీంద్ర జడేజా నీతో గొడవ పడింది అంటూ, పాత విషయాలను వెలికితీస్తున్నారు. ఎంత అవగాహన లేని వారైనా విరాట్ లేని జట్టును ఎంపిక చేస్తారా అంటూ, భారత అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
Discussion about this post