ఐపీఎల్ 17వ సీజన్లో కేవలం రెండు జట్లు మినహా మిగిలిన అన్ని జట్లూ 12 మ్యాచ్‌లు ఆడేశాయి. అయినా ఇప్పటివరకు ప్లేఆఫ్స్‌కు ఒక్క జట్టూ క్వాలిఫై కాలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారేమో. చెన్నైను ఓడించి గుజరాత్ నాకౌట్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. టాప్ 4 ప్లేస్‌ల కోసం ఏయే జట్లు పోటీ పడుతున్నాయి, వాటి అవకాశాలెంతో చూద్దాం!
పాయింట్ల పట్టికలో కోల్‌కతా 16 పాయింట్లు, రాజస్థాన్ 16 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ 1.453 కేకేఆర్కే ఎక్కువ. ఆ రెండు జట్లు చెరో 11 మ్యాచ్‌లు ఆడాయి. ఇవాళ ముంబయితో కోల్‌కతా తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే…ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. రాజస్థాన్ ఒక్క మ్యాచ్‌లో గెలిచినా నాకౌట్ దశకు వెళ్లిపోయినట్లే. పై రెండు జట్ల తర్వాత ఎక్కువ అవకాశాలు ఉన్న టీమ్ హైదరాబాద్. 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా చాలు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం. గుజరాత్‌తో 16న, పంజాబ్‌తో 19న హైదరాబాద్ తలపడనుంది. టాప్ 2లోకి రావాలంటే రెండు మ్యాచుల్లోనూ గెలిచి.. కేకేఆర్, ఆర్ఆర్ తమ మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడిపోవడంతో చెన్నై అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 12 మ్యాచుల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములను నమోదు చేసింది. దిల్లీ 12 పాయింట్లతో, లఖ్ నో 12 పాయింట్లతో… పాయింట్ల పరంగా సమంగా ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో టాప్ 4లో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచుల్లో రాజస్థాన్, బెంగళూరు గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒక్కటి ఓడినా.. హైదరాబాద్, దిల్లీ, లఖ్ నో ఫలితాలపై చెన్నై ఆధారపడాల్సిందే. దిల్లీ, లఖ్ నో తమ తర్వాతి మ్యాచులో నెగ్గి… 14న ముఖాముఖి పోటీపడతాయి. అక్కడ గెలిస్తే ప్లేఆఫ్స్ రేసులో ఉంటారు. ఓడితే ఆశలు అవుట్ అని చెప్పొచ్చు. నెట్‌రన్‌రేట్ ప్రకారం లఖ్ నో కంటే దిల్లీ కాస్త మెరుగ్గా ఉంది. బెంగళూరుతో దిల్లీ మే 12న ఆడనుండగా.. ముంబయితో మే 17న లఖ్‌నవూ తలపడనుంది.
బెంగళూరు వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిన తర్వాత.. గత నాలుగింట్లోనూ గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. చివరి రెండు మ్యాచుల్లో దిల్లీ మే 12, చెన్నై మే 18తో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచినా… టాప్ 4లో చోటు ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడనుంది. గుజరాత్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. 12 మ్యాచుల్లో ఐదింట విజయాలు సాధించి 10 పాయింట్లతో ఉంది. ఆ జట్టు తన చివరి మ్యాచుల్లో గెలిచినా.. ఐదు టీమ్‌ల ఫలితాలను దాటుకొని ముందుకు రావాల్సి ఉంది. అయితే గుజరాత్, బెంగళూరు తమ తర్వాతి మ్యాచుల్లో ఓడితే వాళ్ల ఆఖరి మ్యాచ్ ఫలితంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులు తీసుకురాకపోవచ్చు.
Discussion about this post