ఐపీఎల్ సమరంలో రోజుకో అద్భుతం జరుగుతున్న వేళ, గురువారం జరిగిన మ్యాచ్ కూడా ఊహాతీతంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని అందుకుని, ఔరా అనిపించుకుంది. వరుస ఓటములతో కుంగిపోయిన బెంగళూరు జట్టు, కాకలు తీరిన ఆరంజ్ ఆర్మీపై విజయం సాధించడం, ఐపీఎల్ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. వీరిద్దరి మధ్య జరిగిన ప్రీవియస్ మ్యాచ్ లో సన్ రైజర్స్ అభిమానులు ఆకాశమే హద్దుగా చెలరేగడం, వారికి ఏమాత్రం తగ్గకుండా, బెంగళూరు జట్టు కూడా సై అంటే సై అంటూ కాలుదువ్వడం, ఐపీఎల్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా, హైదరాబాద్ లో జరిగిన మ్యాచులో, బెంగళూరు జట్టు విక్టరీ కొట్టడం, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ లా కనిపిస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ, ఈ ఒక్క విజయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక కొత్త ప్రతిపాదనతో ఐపీఎల్ లోకాన్ని షాక్ కి గురిచేసారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్‌పై నెగ్గింది. అయితే పంజాబ్‌పై మార్చి 25న, ఎస్ఆర్హెచ్పై ఏప్రిల్ 25న బెంగళూరు గెలిచింది. దీంతో ప్రతి నెలలోనే 25వ తేదీ తమకు కలిసొస్తుందని, మే 25న ఐపీఎల్ ఫైనల్ నిర్వహించాలని పోస్టులు పెడుతున్నారు. ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎమోషన్స్ కరెక్టే అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా జరగాలంటే ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్‌కు చేరాలి కదా అని మరికొందరు వ్యంగ్యంగా అంటున్నారు.
Discussion about this post