తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఓ పక్క దగ్గర పడుతున్న నేపథ్యంలో మేనిఫెస్టోను ప్రకటించటంలోను.. అభ్యర్థుల ఎంపికలోను బీజేపీ వెనుకబడటం ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎన్నికల వాగ్దానాలను ప్రకటించి ప్రచారంలో దూసుకువెళుతున్నాయి. అభ్యర్థులను కూడా చాలావరకు ప్రకటించాయి. ఈ విషయంలో బీజేపీ వెనుకపడటం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తోంది.
బిఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా, కాంగ్రెస్ దశల వారీగా ప్రకటిస్తోంది. బీజేపీ మాత్రం పూర్తిగా వెనుకపడింది. మేనిఫెస్టో విషయంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. ఇది పార్టీ కార్యకర్తలు, అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. అసలు పార్టీ వ్యూహం ఏమిటో వారికి అర్ధం కావడం లేదు.
తమ అభ్యర్థులను అందరికన్నా ముందు వెల్లడించడం ద్వారా బిఆర్ఎస్ ముందంజ వేసింది. మరోవైపు కాంగ్రెస్ తన అభ్యర్థులను దశల వారీగా ప్రకటిస్తూ, ఆరు హామీలను ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతోంది. బీజేపీ మాత్రం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి ఇంకా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు మేనిఫెస్టోను రూపొందించడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఇప్పటికే వివిధ వర్గాల సంక్షేమం కోసం వాగ్దానాలను ప్రకటించాయి. వీటిలో పెన్షన్లు, రైతు బంధు వంటి పథకాలు ఉన్నాయి. దీంతో సాధారణంగా ఉచిత పథకాలకు దూరంగా ఉండే బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని అంటున్నారు. తన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వకుండానే సంక్షేమ ప్రతిపాదనలతో ఓటర్లను ఆకర్షించాల్సిన అవసరం ఉండటం మేనిఫెస్టో రూపకర్తలకు తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో లేని పథకాలను ఇక్కడ అమలు చేస్తామని హామీ ఇవ్వడం అంత తేలిక కాదని చెబుతున్నారు.
ఈ ఎన్నికలలో వంట గ్యాస్ ధర బీజేపీకి ప్రధాన సమస్య అని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మధ్య సిలెండర్ ధరను 200 రూపాయల మేర తగ్గించినా ఓటర్లు శాంతించినట్టు కనిపించటం లేదని అంటున్నారు. దీని ప్రభావం లేకుండా చేయడానికి బీజేపీ ఎలాంటి ఎత్తుగడ వేస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన ప్రజాకర్షక పథకాలకు దీటుగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందా. లేదా అని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది.
Discussion about this post