ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై జట్టు.. ఈ సీజన్లోనూ అత్యంత దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆడాలంటే ఆకాశమే హద్దుగా ఆడాలి. వచ్చే నాలుగు మ్యాచుల్లో భారీ తేడాతో విజయం దక్కించుకోవాలి. అప్పుడు ఆ జట్టు 14 పాయింట్లతో తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంది. కానీ, వరుసగా నాలుగు మ్యాచ్లలో గెలవాలంటే కష్టమే.
పెద్దపెద్ద ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ముంబై ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. వ్యూహాల అమలులో స్పష్టత లేకపోవడంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడగా… కేవలం మూడు మ్యాచుల్లో గెలిచి ఆరు పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఈ స్థాయిలో ఉన్న ముంబై జట్టు.. వరుసగా నాలుగు మ్యాచులు గెలిచి, ప్లే ఆఫ్ వెళుతుందంటే నమ్మశక్యమైన విషయం కాదు. గత సీజన్లో ఇలాంటి పరిస్థితే ఎదురైన నేపథ్యంలో.. ముంబై యాజమాన్యం కోట్లు వెచ్చించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా తీసుకుంది. అయినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఐదుసార్లు ముంబై జట్టును విజేతగా నిలిపిన రోహిత్ శర్మను కూడా మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అయినప్పటికీ ముంబై జట్టు రాత మారలేదు. హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచులు గెలవాలంటే కచ్చితంగా జట్టులో మార్పులు చేయాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచుల్లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి.. రోహిత్ శర్మకు తిరిగి సారధ్య బాధ్యత అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
Discussion about this post