తెలంగాణ విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్.. ఇపుడు ఏపీలో గెలుపు పై దృష్టి పెడుతోంది. ఇన్నాళ్లూ నిస్తేజంగా, నీరసంగా ఉన్న కాంగ్రెస్ ఏపీ లో ఎలాగైనా అధికారం సాధించాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ వ్యూహాల్లో భాగంగా వైఎస్ షర్మిలను ఏపీ బరిలోకి దించాలని భావిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ కి మద్దతు పలికింది. ఈ క్రమంలో షర్మిలను ఏపీ లో జగన్ పై ప్రయోగించాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు.
2014 లో ఉమ్మడి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ యే కారణమని ఆగ్రహించిన ఓటర్లు నాటి ఎన్నికల్లో ఆపార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. చాలామంది నేతలు జగన్ పార్టీ లో చేరిపోయారు. కొందరు తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. ఏపార్టీ లోకి వెళ్ళ లేని నేతలు సైలెంట్ గా ఉండిపోయారు.కొందరైతే రాజకీయాలకు దూరమై పోయారు. అలాంటి వారందరిలో కదలిక తెచ్చి మళ్ళీ పార్టీ కి పూర్వవైభవం తేవాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు.ఇందుకోసం భారీ కసరత్తు చేస్తున్నారు. అయితే పార్టీ ని ముందుండి నడిపించే నేత .. ఒక ఇమేజ్ ఉండే నాయకుడు లేకపోవడం తో… షర్మిల సరైన వ్యక్తి అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
voice
వైఎస్ వారసురాలే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి వస్తే.. కాంగ్రెస్ క్యాడర్ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్న హైకమాండ్ షర్మిలతో ఇప్పటికే చర్చించిందని అంటున్నారు. . షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ ను చేసి ప్రత్యేక హోదా నినాదంతో ప్రచారం చేద్దామని.. అప్పుడు కాంగ్రెస్ వర్గాలన్నీ వెనక్కి వస్తాయని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారంటున్నారు. షర్మిలకు రాజకీయంగా బలం అందించడానికి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని కూడా హామీ ఇచ్చారని చెబుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను షర్మిలకు పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయితే ఇప్పటికిప్పుడు అద్భుతాలే జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ నేతలకు నమ్మకం లేదు. కానీ కాంగ్రెస్ బలపడుతుంది. అధికారంలోకి రాకపోవచ్చు కానీ.. పూర్వ వైభవం దిశగా మొదటి అడుగు పడుతుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. ఈ సారి ఎన్నికల్లో భారీగా మార్పులు చేర్పులతో కాంగ్రెస్ నేతలు ప్రయోగాలు చేస్తున్నారు. వైసీపీ లో ఆదరణ దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రత్యేకహోదా నినాదంతో కాంగ్రెస్ .. షర్మిల నాయకత్వంలో ముందుకెళితే రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు. మరి షర్మిల అందుకు సిద్ధం అవుతారా అన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
ఇక జగన్, షర్మిల మధ్య రాజీ కుదిరిందని.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రాకపోచ్చని కూడా మరో వైపు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్, షర్మిలలతో మాట్లాడి వారి మధ్య ఉన్న ఆస్తుల పంచాయతీని సెటిల్ చేశారని అంటున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో.. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు జగన్ అంగీకరించారని అంటున్నారు. ఇదే నిజం అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రారు. ఇపుడు జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానం గానే మిగిలిపోవచ్చు. అలాంటపుడు షర్మిల ను కాంగ్రెస్ ఎలా ఉపయోగించుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న.
ఈ నెల 21న ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీలో స్ట్రాటజీ మీటింగ్ జరగబోతోంది. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఏపీలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై యాక్షన్ ప్లాన్ రెడీ కావచ్చు అంటున్నారు. షర్మిల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలీ మరి.
Discussion about this post