టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరుపై ఫోకస్ పెట్టారు. వైసీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట కావడంతో ఈ సారి నెల్లూరులో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి బరిలో ఉండటంతో.. ఈ సీటును కైవసం చేసుకుని… జగన్ కు స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని చంద్రబాబు చూస్తున్నారు. సిద్ధం సభలకు ధీటుగా ప్రజాగళం సభలు నిర్వహిస్తూ… నెల్లూరులో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా జగన్ ముఖ్య అనుచరుడు విజయసాయి రెడ్డి బరిలో ఉండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రెడ్డి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. దీంతో టీడీపీ నెల్లూరుపై ఫోకస్ చేసింది. నెల్లూరులో ఈ సారి వైసీపీ ఖాతా తెరవకుండా.. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మండుటెండలో వయస్సును కూడా లెక్క చేయకుండా నెల్లూరు ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఉదయగిరి, వెంకటగిరి ప్రాంతాల్లో ప్రజాగళం సభలను టీడీపీ అధినేత నిర్వహించారు. జగన్ సిద్ధం సభలకు ధీటుగా చంద్రబాబు ప్రజాగళం సభలు సాగుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో చంద్రబాబు సభ నిర్వహించారు. ఈ సభతో టీడీపీ కేడర్ లో నయా జోష్ వచ్చింది. రాత్రి అక్కడే బసచేసి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ప్రజలతో చంద్రబాబు మమేకమయ్యారు. చంద్రబాబు పర్యటనతో ఉదయగిరిలో పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయగిరిలో టీడీపీకి సానుకూల పనవాలు వీస్తున్నాయి.
గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ప్రజాగళం సభలు సాగుతున్నాయి. కింది స్థాయి కార్యకర్తలను కూడా కలుస్తూ వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపుతూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. దీంతో నెల్లూరులో టీడీపీ కేడర్ కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాగళం సభల్లో వ్యక్తిగత దూషనలను తగ్గించి… స్థానిక సమస్యలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరులో జరిగిన అభివృద్దితో పాటు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులను చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. ఇటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా కేడర్ లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడుల అంశంతో పాటు ఉద్యోగాల కల్పన వంటి అంశాలను చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. తన అరెస్టు సమయంలో ఐటీ ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందనను చంద్రబాబు ప్రజాగళం సభల్లో ప్రస్తావిస్తూ.. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే… రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నారు. చంద్రబాబు ప్రచారానికి నెల్లూరులోని యువత నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. బాబు వస్తేనే జాబులు వస్తాయని యువత బలంగా విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామిని చంద్రబాబు సెంటిమెంట్ గా భావిస్తారు. దీంతో ఇక్కడి నుంచి ప్రజాగళాన్ని ప్రారంభించారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… చంద్రబాబు ప్రజాగళం సభలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగళం సభలకు భారీగా జనాన్ని సమీకరించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా… ఆ తర్వాత పార్టీ విధానాలు నచ్చకపోవడంతో టీడీపీ తీర్థం పుచుకున్నారు. వేమిరెడ్డి పనితనాన్ని గుర్తించిన చంద్రబాబు వేమిరెడ్డిని ఎంపీ బరిలో నిలిపి ఆయన సతీమనికి కొవ్వూరు టికెట్ ఇచ్చారు. ఇలా బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి కూడా బరిలో ఉండటంతో టీడీపీ వార్ ను వన్ సైడ్ చేసినట్లుగా కనిపిస్తోంది.
తాము అందించిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే… అవి వైసీపీ పథకాలు కాదు… ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చిన పథకాలని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. నెల్లూరులో ప్రాంతాల వారిగా నేతలను సమన్వయం చేస్తూ గెలుపే లక్ష్యంగా బాటలు వేస్తున్నారు. టికెట్ల కేటాయింపులో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ సమన్యాయం పాటిస్తున్నారు. ఇలా చంద్రబాబు వ్యూహాలతో నెల్లూరులో ఇప్పుడు అన్ని వర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు వ్యూహాలతో ఇప్పుడు నెల్లూరు టీడీపీకి కంచుకోటగా మారింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విజయసాయిరెడ్డి విజయం సాధించడం అసాధ్యమని నెల్లూరు ప్రజలంటున్నారు. మొత్తంగా నెల్లూరులో ఈ సారి వైసీపీ జెండా ఎగరడం కష్టంగానే కనిపిస్తోంది.
Discussion about this post