2024 న్యూ ఇయర్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త విజయంతో ప్రారంభించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ద్వారా ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం అంటే ఎక్స్‌పోశాట్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా భారత్‌కు చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపగా నిర్ణీత కక్ష్యలోకి చేరుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగంలో తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ విద్యార్థినులు తయారు చేసిన శాటిలైట్ సహా పది పేలోడ్‌లు ఉన్నాయి. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి ప్రయోగం ప్రపంచంలోనే రెండోదని.. భారత్ కంటే ముందు 2021లో ఈ తరహా ప్రయోగం నాసా మాత్రమే చేసిందని తెలిపారు.
ఎక్స్‌పోశాట్ జీవితకాలం అయిదేళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌కు సంబంధించిన వివరాలను ఎక్స్‌పోశాట్ బహిర్గతం చేస్తుంది. 2023 సంవత్సరంలో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాల సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న ఇస్రో ఎక్స్‌పోశాట్ ప్రయోగంతో 2024 నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది.
Discussion about this post