ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే జ్వరాల తీవ్రత పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం తిరుమలాయ పాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామంలో ఓ డెంగ్యూ కేసు నమోదు కాగా ఆ గ్రామంలో ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు. జిల్లాలో పెరుగుతున్న జ్వరాలపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం…
ప్రతి ఏటా వర్షాకాలంలో జ్వరాల తీవ్రత భారీగా పెరుగుతుంది. సహజంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, సాధారణ జ్వరాల కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా జూన్, జులై నెలల్లోనే ఈ కేసుల ప్రభావం కనిపిస్తుంది. దీంతో జిల్లా వైద్యాధికారులకు టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామం విష జ్వరాలతో వణికిపోతోంది. ఈ గ్రామంలో ఇప్పటికే ఓ డెంగ్యూ కేసు నమోదయింది.
డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్న జల్లేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే గ్రామంలో అనేక మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన చాలా మంది జ్వరం బారిన పడటంతో జల్లేపల్లి గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. జ్వరాలతో ఉన్న వారంతా తమకు డెంగ్యూ జ్వరం వచ్చిందేమోనని ఆందోళన చెందుతున్నారు. జల్లేపల్లి చుట్టుపక్కల గ్రామాల్లోనూ జ్వరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాలు విజృంభించడానికి ఆ గ్రామంలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణమే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవలే గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీకాలం ముగిసింది. గ్రామం ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తోంది. ప్రభుత్వం అయితే ప్రత్యేక అధికారి నియమించింది కానీ ఆ ప్రత్యేక అధికారి ఎవరు కూడా ఈ గ్రామం వైపు ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు లేవు. ప్రత్యేక అధికారి ఎవరో కూడా తమకు తెలియదని గ్రామస్తులు చెబుతున్నారు. ఫలితంగా జల్లేపల్లి గ్రామంలో పాలన అటకెక్కింది. వర్షాకాలం కూడా మొదలైంది. వర్షాకాలం ప్రవేశించగానే గ్రామంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఆ గ్రామంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పురుగు నీరు, తాగునీరు ప్రవహిస్తుంది.
తాజాగా ఈ గ్రామానికి వచ్చిన అధికారులకు గ్రామంలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం స్వాగతం పలికింది. వీధుల గుండా పాడుతున్న నీటిని దాటుకుంటూనే అధికారులు అధికారులు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు విష జ్వరాల బారిన పడడానికి కారణం ఏమిటో గ్రామంలోని పరిస్థితి అద్దం పడుతుంది.
సర్పంచి పదవీకాలం ముగియడంతో అన్ని గ్రామాలతో పాటు జల్లేపల్లి గ్రామం కూడా ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్ళింది. అయితే ఈ గ్రామానికి ప్రత్యేక అధికారిగా నియమించబడిన వ్యక్తి ఏనాడూ ఈ గ్రామం వైపు చూడలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉంది. దీంతో ఆ గ్రామస్తులు శీనన్న ఒక్కసారి వచ్చిపో మా గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి… నువ్వు వస్తేనే అధికారులు మా వైపు చూస్తారు అంటూ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
జల్లేపల్లి గ్రామంలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం గ్రామాన్ని సందర్శించి వాడవాడలా పర్యటించింది. ప్రజలు జ్వరాల బారిన పడడానికి గల కారణాలను అన్వేషించారు. గ్రామంలో చాలాచోట్ల నీరు రోడ్డుపైనే వీధుల గుండా పారుతుండడం గమనించిన అధికారులు… తాగునీరు కలుషితం కావడం వాంతులు, విరోచనాలతో జ్వరాలకు కారణమవుతుందని… అదే విధంగా పలు చోట్ల ఖాళీ వాటర్ బాటిల్లు, డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు ఉండడం గమనించారు. వర్షం పడగానే ఖాళీ ప్రదేశాల్లోని వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో నీరు నిలువ ఉండి… దోమలు గుడ్లు పెడుతాయని, ఫలితంగా దోమలు వృద్ధి చెంది దోమకాటుతో డెంగ్యూ జ్వరాలు వస్తాయని జిల్లా వైద్య అధికారి స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ఆమె పలు జాగ్రత్తలు సూచించారు.
తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాలకు కారణం అపరిశుభ్ర వాతావరణమే నని ఇటు గ్రామస్తులు, అటు జిల్లా వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. గ్రామంలో నెలకొన్న ఈ అపరిశుభ్ర వాతావరణం తొలగించి ప్రజలను జ్వరాల బారి వారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక అధికారి పాలన ఏ మేర దోహదం చేస్తుందో చూడాలి.
Discussion about this post