130 ఏళ్ల నాటి ఆలోచనకు రూపం తీసుకురావడానికి జపాన్‌కు చెందిన ఒక కంపెనీ కసరత్తు చేస్తోంది. అంతరిక్ష లిఫ్ట్‌ను నిర్మించాలనుకుంటోంది. వచ్చే ఏడాది నుంచే పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇది సాకారమైతే చాలా సులువుగా, చౌకలో రోదసిలోకి మానవులను, సరకులను చేరవేయవచ్చు. 2050 నాటికి స్పేస్ ఎలివేటర్ పూర్తిచేయాలని ఆ కంపెనీ భావిస్తోంది.
రష్యా రాకెట్ శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ సియోల్కోవ్స్కీ తొలుత ఈ అంతరిక్ష లిఫ్ట్ ఆలోచన చేశారు. 1895లో ఆయన రాసిన ‘డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై’ పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది. అందులో ఆయన 22వేల మైళ్ల ఎత్తయిన ఒక ఊహాజనిత టవర్‌ను వర్ణించారు. ఈ ఆలోచనను రష్యాకు చెందిన ఇంజినీర్ యూరి ఆర్ట్స్టానోవ్ మరింత ముందుకు తీసుకెళ్లారు. భూమి నుంచి భూ అనువర్తిత కక్ష్య వరకూ ఒక కేబుల్ ఏర్పాటు చేయాలని, దాని సాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతిపాదించారు. అలనాటి ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకురావాలని జపాన్‌కు చెందిన ఒబయాషీ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టీవీ టవర్ ‘టోక్యో స్కైట్రీ’ వంటి విప్లవాత్మక ప్రాజెక్టులను సాకారం చేసిన చరిత్ర ఈ కంపెనీది. ఈ సంస్థ ప్రతిపాదిస్తున్న లిఫ్ట్‌ను స్పేస్ ఎలివేటర్‌గా పిలుస్తున్నారు. భూ కక్ష్యలోకి, దాని వెలుపలికి యాత్రలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. వచ్చే ఏడాది దీని నిర్మాణO ప్రారంభించి, 2050 నాటికి పూర్తిచేయాలని ఒబయాషీ భావిస్తోంది.స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో భాగంగా పుడమి నుంచి రోదసిలోని భూస్థిర కక్ష్యలోని ఉపగ్రహం వరకూ కేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ శాటిలైట్.. భూమితో సమానంగా భ్రమణ, పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ అది భూమికి ఎగువన నిర్దిష్టంగా ఒకే ప్రదేశంలో ఉంటుంది. అంతరిక్ష లిఫ్ట్ కేబుల్.. భూమి నుంచి 96వేల కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరిస్తుంది. దీని కౌంటర్వెయిట్ ఇక్కడే ఉంటుంది. భూమధ్యరేఖా ప్రాంతంలో సముద్రంలో ‘ఎర్త్ పోర్ట్’ను ఏర్పాటు చేస్తారు. ఎర్త్ పోర్ట్‌లో బలాస్ట్ ఉంటుంది. కేబుల్ టెన్షన్ ను కూడా అక్కడే సర్దుబాటు చేస్తారు. ఎర్త్పోర్ట్కు చేరువలో నేలపై మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సాగరంలోని ఎర్త్ పోర్ట్‌కు చేరుకోవడానికి.. సముద్రం కిందనుంచి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కేబుల్ సాయంతో క్లైంబర్ అనే విద్యుదయస్కాంత వాహనాలు రోదసిలోకి వెళ్లడం, కిందకి రావడం చేస్తాయి. వాటిలో మానవులు ప్రయాణించొచ్చు. సరకును రవాణా చేయవచ్చు.
స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్టులో భాగంగా కేబుల్ వెంబడి 36వేల కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషన్‌ను నిర్మిస్తారు. సందర్శకులు అక్కడికి వెళ్లి.. శూన్య గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విశ్వాన్ని వీక్షించొచ్చు. అక్కడి నుంచి భూస్థిర కక్ష్య ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు. ఈ కేబుల్ వెంబడి 3,900 కిలోమీటర్ల ఎత్తులో మార్స్ గ్రావిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయవచ్చు. అక్కడ అంగారకుడి ఉపరితలంపై ఉండేంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాగే 8,900 కిలోమీటర్ల ఎత్తులో లూనార్ గ్రావిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయవచ్చు. అక్కడ చందమామ ఉపరితల స్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఈ రెండు కేంద్రాల్లో ప్రయోగాలు, వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడం వంటివి చేయవచ్చు.23,750 కిలోమీటర్ల ఎత్తులో భూదిగువ కక్ష్య ద్వారాన్ని (లియో గేట్) ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి లియో ఉపగ్రహాలను జారవిడవొచ్చు. అవి భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యకు చేరుకొని అక్కడే పరిభ్రమిస్తాయి. ఈ లిఫ్ట్ సాయంతో భూస్థిర కక్ష్యలో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అక్కడ ఉత్పత్తయ్యే కరెంటును భూమికి చేరవేయవచ్చు. 57వేల కిలోమీటర్ల ఎత్తులో ‘మార్స్ గేట్’ ఉంటుంది. అక్కడి నుంచి అంగారకుడి వద్దకు వ్యోమనౌకలను పంపొచ్చు. భూమి నుంచి 96వేల కిలోమీటర్ల ఎత్తులోని కౌంటర్ వెయిట్ కేంద్రంలో ‘సౌర కుటుంబ అన్వేషణ ద్వారం’ను ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదేశంలోని పరిభ్రమణ వేగాన్ని ఉపయోగించుకొని గురుగ్రహం, గ్రహశకలాల వద్దకు వ్యోమనౌకలను సులువుగా పంపొచ్చు. గ్రహశకలాల నుంచి విలువైన వనరులను సేకరించి, తిరిగి భూమికి రప్పించొచ్చని ఒబయాషీ చెబుతోంది.
అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రస్తుతం రాకెట్లు వాడుతున్నారు. వాటి నుంచి భారీగా హానికర ఉద్గారాలు వెలువడుతుంటాయి. స్పేస్ ఎలివేటర్లకు రాకెట్ ఇంధనాలు అవసరం లేదు. ఇందులో విద్యుదయస్కాంత వాహనాలే ఉంటాయి. సౌర విద్యుత్‌తోనూ వాటిని నడపొచ్చు. అందువల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. అంతరిక్ష యాత్ర ధర కూడా గణనీయంగా తగ్గుతుంది. సాధారణంగా అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి 6-8 నెలలు పడుతుంది. స్పేస్ ఎలివేటర్ సాయంతో 3-4 నెలల్లో అక్కడికి చేరుకోవచ్చు. అవసరమైతే 40 రోజుల్లోనూ వెళ్లొచ్చు. స్పేస్ ఎలివేటర్.. రాకెట్ కన్నా నెమ్మదిగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. అందువల్ల ఈ ప్రయాణంలో ప్రకంపనలు, కుదుపులు ఉండవు. అంతరిక్షంలోకి సున్నితమైన సాధనాలను మోసుకెళ్లడానికి ఇది అనువుగా ఉంటుంది. అయితే ఈ స్పేస్ ఎలివేటర్‌ను సాకారం చేయడం అనుకున్నంత సులువు కాదు. అనేక ఇంజినీరింగ్ అవరోధాలు ఉన్నాయి. 96వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్‌ను తయారుచేయడమే ప్రధాన సవాల్. అది తేలిగ్గా ఉండాలి. అదే సమయంలో దృఢంగానూ ఉండాలి. కర్బన నానోగొట్టాల పరిజ్ఞానం ఇందుకు అక్కరకొస్తుందని ఒబయాషీ సంస్థ చెబుతోంది. ఉరుములు, మెరుపులు, తుపాన్లు వంటి తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులు, అంతరిక్ష శకలాల నుంచి ఈ ఎలివేటర్‌కు ముప్పు పొంచి ఉంటుంది. వీటిని కూడా అధిగమించాలి ఉంటుంది.
Discussion about this post