మిర్చి, బాహుబలి, ఎవరికి చెప్పొద్దు లాంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..’చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి ఒక చరిత్రే జితేందర్ రెడ్డి జీవితం. రాకేష్ ఈ సినిమాతో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో జీవించారు. ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం. అలాంటి ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ల చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.
నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ..’ఇందులో నా క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్గా చాలా సినిమాల్లో నటించా. కానీ ఇది కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గ్లింప్స్ చూసిన తర్వాత సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. విరించి వర్మ గతంలో చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.
Discussion about this post