ఖమ్మం లోక్ సభ టికెట్ కోసం కాంగ్రెస్ నాయకులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఇప్పటికే అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నవారు టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా.. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలిపిస్తామంటున్న నేతలు, ఒకవేళ వారెవరూ బరిలో నిలవకపోతే సీటు తమకే కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఎవరికివారు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ 12 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ఉన్నారు. సీనియర్ నేత రేణుకా చౌదరి సీటు ఆశించినప్పటికీ అధిష్ఠానం రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించటంతో ఆమె బరి నుంచి తప్పుకున్నట్లయ్యింది.
టికెట్ దక్కించుకోవటం కోసం వీవీసీ ట్రస్ట్ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమకు అవకాశం కల్పించాలని సీని యర్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, నాగ సీతారాములు కోరుతున్నారు. ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు తమకు అవకాశం కల్పించాలని తాజాగా పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్ విజ్ఞప్తి చేస్తుండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్క నియోజకవర్గం మినహా మిగతా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ కూటమి గెలుపొందింది. ఖమ్మం లోక్ సభ స్థానం పరిధిలోని కొత్తగూడెంలో సీపీఐ, మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే సునాయాస విజయం సాధించవచ్చునని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయటానికి రాహుల్ గాంధీకి ఎక్కువ సమయం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి బరిలో నిలిచే రేసు గుర్రమెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
Discussion about this post