ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్ రావు వ్యవహార శైలిపై పార్టీ నేతల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అంతా తానే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పట్టించుకోకపోగా తన అనుయాయులకు పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరికి వారే ..యమునా తీరే అన్నట్టుగా పార్టీ నేతలు వ్యవహరిస్తుంటే.. జిల్లా అధ్యక్షుడిగా వారిని ఐక్యం చేయడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన తాత మధుసూదన్ రావు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను దబాయించి తన పనులు చక్కబెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలేరు నియోజకవర్గంలో మట్టి మాఫియాకు పరోక్షంగా సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ఒకరిద్దరు జైలు పాలు కూడా అయ్యారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టించినట్టు ఆ పార్టీ నాయకులే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఎమ్మెల్సీగా ఉన్న తాత మధు సూదన్ కు కేసీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పార్టీలో తన మార్క్ కోసం అనేక ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఎంతోకాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఉద్యమకారులను పక్కకు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. పార్టీ సమావేశాలు జరిగే వేదికలపైకి సీనియర్ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడంలో ఆయన నిర్లక్ష్యం వహిస్తారని చెబుతుంటారు. జిల్లాలో పార్టీని వర్గాలుగా విభజించి తన అనుయాయులకు మాత్రమే గౌరవం వచ్చేలా ఆయన చర్యలు ఉంటాయని కార్యకర్తలు చెబుతున్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోను ఆయనకు అసలు పొసగదని చెబుతున్నారు. ఒక దశలో అజయ్ ను సైతం కాదని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని చూశారని, దీంతో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య యుద్ధం సాగిందన్న టాక్ వినిపించింది. కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా, జిల్లా అధ్యక్షుడిగా అయ్యానన్న ధీమాతో జిల్లా నాయకులతో అంటిముట్టనట్లు ఉండేవారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ నాయకులు, కార్తకర్తలను చాలా చులకన చేసి మాట్లాడేవారని చెబుతున్నారు.
Discussion about this post