తమ హయాంలో ముస్లింలకు అన్యాయం జరగదని, వారి హక్కులకు భంగం కలిగే చర్యలు ఏనాడూ తీసుకోబోనని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నడూ లేనివిధంగా సీఎం ముస్లింలకు పథకాలు రద్దు చేశాడని, ఆర్థిక సాయం నిలిపివేశాడని ఆయన ధ్వజమెత్తారు. కుప్పంలోని KVR మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు.
ముస్లింలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని, 40 ఏళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, చంద్రబాబు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేశామని.. ముస్లింలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారన్నారు. హజ్ యాత్ర కోసం హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి విమాన సదుపాయాన్ని కల్పించామన్నారు. రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్ ల నిర్మాణం చేపట్టి 90 శాతం పూర్తి చేశాం.. కాని వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ కు , విభజన తర్వాత కర్నూలుకూ ఉర్దూ యూనివర్సిటీని తెచ్చామని చంద్రబాబు తెలిపారు.
టీడీపీ హయాంలో పేద ముస్లింలైన 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. దుకాన్ మకాన్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టాం. 33 వేల మందికి దుల్హన్ పథకం ద్వారా రూ.165 కోట్లు ఆర్థిక సాయం ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. విదేశీ విద్య పథకంలో 527 మందిని విద్యార్థులను విదేశాలకు పంపించామని చంద్రబాబు తెలిపారు. ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీనే. కానీ 6 నెలలుగా ఈ ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం లేదు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మిగనూరులో హజీరాబీ అనే ముస్లిం యువతిని కొందరు వైసీపీ గూండాలు అత్యాచారం చేసి చంపేస్తే పట్టించుకోలేదు. వి.కోటలో చదువుల తల్లి మిస్బా బాగా చదువుతుంది…కానీ వైసీపీ నేత కూతురు సెకెండ్ వస్తోందని మిస్బాకు టీసీ ఇవ్వడంతో ప్రాణాలు వదిలిపెట్టిందని చంద్రబాబు చెప్పారు.
కళ్యాణదుర్గంలో చాపిరి గ్రామంలో యువతిని మోసం చేసి చంపి నదిలో పడేశారని, దాచేపల్లిలో అలీషా మద్యం అమ్ముతున్నాడని నింద వేసి కొట్టి చంపేశారన్నారు. కడపలో అక్బర్ బాషాకు చెందిన భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్యకు యత్నించాడు. ముస్లిం యువకులపై పుంగనూరులో కేసులు పెట్టి 12 మందిని జైలుకు పంపారని తెలిపారు. మసీదును కబ్జా చేస్తున్నారని పోరాడినందుకు నరసరావుపేటలో ఇబ్రహీంను నరికి చంపారని చంద్రబాబు మండిపడ్డారు. నేను సీఎంగా ఉన్నంత కాలం మీకు అన్యాయం జరగదని, దుర్మార్గ ప్రభుత్వం వస్తే మీకూ భవిష్యత్తు ఉండదు. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ముస్లింల భద్రతకు నాది బాధ్యత.’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Discussion about this post