పార్లమెంటు ఎన్నికలవేళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ బిఆర్ఎస్ కు రాజీనామా చేయటంతో ఆయన వర్గీయులు కూడా ఆయనతో పయనించేందుకు రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల క్రితం ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసిఆర్ కు ఫాక్స్ ద్వారా పంపించడం… వెనువెంటనే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపడం….
2018లో ఎన్నికల్లో వైరా నియోజకవర్గ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన రాములు నాయక్ అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ పై విజయం సాధించారు. ఆపై అప్పటి ఎంపీ ఇప్పటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ను అధిష్టానం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు కేటాయించింది. దీంతో అసంతృప్తి చెందిన రాముల నాయక్ వర్గం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్, మంత్రి కేటీఆర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాములునాయక్ కు టికెట్ రాకుండా చేశారని ఆయన వర్గీయులు ఆరోపించారు.
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా.. పార్టీకి విధేయుడుగా పనిచేసినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జి పదవిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాము నాయక్ నిరాశ చెందారు. దీంతో తన రాజీనామా పత్రాన్ని నేరుగా జిల్లా అధ్యక్షుడు తాత మధు కి పంపి, ఆపై బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఫాక్స్ లో పంపారు. నియోజకవర్గంలో తనకు సమచిత స్థానం అందకపోవటం… ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర నిరాశకు గురై పార్టీ మారే నిర్ణయాన్ని తీసుకున్నారు. రాములు నాయక్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న సమయంలో దళిత బంధు 1100 యూనిట్ లు నియోజకవర్గానికి ప్రకటించారు. అదే సమయంలో అధిష్టానం మదన్ లాల్ కి టికెట్ ప్రకటించడంతో రాములు నాయక్ కి కొంత మదన్ లాల్ కి కొంత దళిత బంధు యూనిట్ పంచారు. అయితే రాములు నాయక్ కేటాయించిన దళిత బంధువుని ఆపి.. మదన్ లాల్ కు కేటాయించిన దళిత బంధు లిస్టులో చేర్చడంతో తీవ్ర దుమారం రేగింది. దీనికంతటికి కారణం అప్పటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కారణమని ఓ నిండు సభలో రాములు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అన్న మాటలు అప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తదుపరి ఎంపీ నామా నాగేశ్వరరావు వద్దిరాజు రవిచంద్ర కలగజేసుకొని మంత్రి పువ్వాడ అజయ్ – ఎమ్మెల్యే రాములు నాయక్ కు సంధి చేశారు.
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కూడా ఓడిపోయిన మదన్ లాల్ కు ఇంచార్జి పగ్గాలు అప్పజెప్పడంతో రాములు నాయక్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు తాతా మధు లు రాములు నాయక్ తీసుకున్న నిర్ణయంపై వారి ఇంటికి నేరుగా వెళ్లి చర్చించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వైరా నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ భవిశ్యత్తు అగోమ్యముగా మారింది. రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గుసగుసలు వినపడుతున్న నేపథ్యంలో బీఆర్ ఎస్ కు గట్టి దెబ్బ తగిలిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏదైనాప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మదన్ లాల్ కు పార్లమెంటు ఎన్నికలకు నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పజెప్పడంతో, ఆయన వ్యవహార శైలికి కొంతమంది నేతల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. దీంతో పార్టీకి ఇంకా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు అభిప్రాయ పడుతున్నారు.
Discussion about this post