లేపాక్షి … ఈ పేరు వినగానే చాలా మందికి మనసులో ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. ప్రధాన శైవక్షేత్రంగా, ప్రసిద్ద పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన లేపాక్షి యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. అంతే కాదు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతిహాసాల్లో దీని ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణదేవ రాయల కాలంలో మిక్కిలి ప్రసిద్ది చెందింది. నేటికీ అనేక మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన లేపాక్షి దేవాలయం గురించి ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం…
గుడి నిర్మాణానికి ముందు ఆ ప్రాంతమంతా పెద్ద కొండ ప్రాంతంగా ఉండేదట. ఈ కొండను కూర్మగిరి తాబేలు కొండ అని పిలిచే వారని ఇప్పుడక్కడి గుడిలో అర్చకునిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు తెలిపారు. రామాయణం ప్రకారం… రావణాసురుడు సీతను అపహరించుకుని వెళుతుండగా ఈ కూర్మ పర్వతంపైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలములో పడిపోయినట్లు, ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు జటాయువును చూసి… జరిగిన విషయం తెలుసుకుని… తర్వాత ఆ పక్షికి మోక్షమిచ్చి లే-పక్షీ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను పదమే క్రమ క్రమముగా లేపాక్షి అయినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.
ఇక ఈ గుడికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం అచ్యుతరాయలు కాలంలో కోశాధికారిగా కొనసాగిన విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తి చేస్తాడు. కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజు గారికి విరూపణ్ణ వ్యతిరేకులు ఈ విషయం చెబుతారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు ఇప్పటికీ చూపుతుంటారు. అలా లోప- అక్షి… అంటే కళ్లు లేని… అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.
ఇక లేపాక్షి బసవేశ్వరుని విషయానికొస్తే… ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇచ్చట గుట్టవంటి ఏకశిలను బసవేశ్వరుడుగా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద బసవడు బహుకొద్ది చోట్ల మాత్రమే ఉన్నాయి. ఈగుడిని ఉద్ధేసించి ‘లేపాక్షి రామాయణము’ అనే హరికథ ఉంది. పాతికకు మించి శిలా స్తంభాలు, నాలుగు వైపులా చక్కగా శిల్పాలతో చెక్కినవి బహు ముచ్చటగొలిపే మండపం ఏర్పర్చేలా ఉన్నాయి. ఇలాంటి మండపం ఇతర చోట్ల సామాన్యంగా కనిపించదు. నాలుగు కాళ్ళ మండపం విజయనగరపు ఆలయాల్లో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కానీ ఈ ఆలయంలో పశ్చిమ వైపు భాగంలో ఉంది.
లేపాక్షి శ్రీ కృష్ణదేవ రాయలు కాలములో మిక్కిలి ప్రసిద్ది చెందింది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగా ఈ ఊరిలో ఉండేవారు. ఈ ఊరి పక్కన కూర్మగిరిపై శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేదట. ఋషులు అరణ్యంలో తపస్సుకు వచ్చి ప్రశాంతంగా డేవున్ని కొలిచేవారట. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరు బయట ఉంటుంది. చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరంగా ఉంటుంది.
లేపాక్ష్క్షి శిల్ప కళా వైభవం గురించి మాటల్లో వివరించలేనంతగా ఉంటుంది. చూసేందుకు రెండు కళ్లూ చాలవన్నట్లు ఇక్కడి శిల్ప కళా వైభవం కనువిందు చేస్తుంది. వీరభద్ర స్వామి గర్భగుడిలో 7 నుంచి 8 అడుగుల విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఈ గర్భగుడి చుట్టు 8 లింగాలను నిర్మించారు. స్వామి వారికి కుడివైపున దేవుని మూల నవ గ్రహాలను నిర్మించారు. భారతదేశంలో అత్యంత పురాతనమైన దేవాలయాల్లో లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ఒకటిగా ఉండడం విశేషం. ఆలయం వెలుపల సీతమ్మ వారి పాదం మనకు దర్శనమిస్తుంది. ఇందులో నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఎంత కరువు వచ్చినప్పటికీ సీతమ్మ వారి పాదంలో మాత్రం నీరు ఏనాడు ఆగిన పరిస్థితి లేదు. అనేక మంది ఎన్నో పరిశోదనలు చేసినప్పటిపకీ సీతమ్మ వారి పాదం గుండా వచ్చే నీరు ఎక్కడ నుంచి వస్తుందో కనిపెట్టలేక పోయారు.
లేపాక్షిలో నిత్యం పూజలు అందుకుంటూ ప్రపంచ యాత్రికులను ఆకర్షిస్తుంది లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయంలో అత్యంత పురాతనమైన శిల్ప సంపదను వీక్షించడానికి దేశ నలుమూలల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో చెక్కిన శిల్ప సంపదతో పాటు ఆలయ పైభాగంలో ఎంతో గొప్పగా వేసిన పురాతన రంగులు ఆకట్టుకుంటాయి. పురాతన పెయింటింగ్స్ ను గమనిస్తే శ్రీకృష్ణదేవ రాయల కాలం నాటి అంశాలు, సీతా స్వయంవరంతో పాటు పురాణాల గురించి అనేక చిత్రాలను ఆలయ పై భాగంలో మనం చూడవచ్చు. ఇక్కడ భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునే మరో విశేషమేమిటంటే… కింది నుంచి మనం ఏవైపు నుంచి చూస్తే… పైనున్న చిత్రాలు మనకు మనల్నే చూస్తున్నట్లు కనిపిస్తాయి.
ధ్వజస్తంభం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకు నాట్య మండపం కనిపిస్తుంది. ఈ వీరభద్ర నాట్య మండపము దర్శించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. పెద్ద, పెద్ద రాతి స్తంభాలపై ఏకశిలా విగ్రహాలు ప్రతిచోట మనకు దర్శనమిస్తాయి. అత్యంత వైభవంగా ఈ నాట్య మండపాన్ని నిర్మించారు. ఈ నిర్మాణం గొప్పదనం తెలియాలంటే… ఇది చూడండి. దాదాపు ఒక టన్ను బరువు కలిగిన వేలాడే స్తంభం ఇది. నేలకు ఏమాత్రం ఆనకుండా మండపాన్ని కాపాడుతోంది. ఈ వేలాడే స్తంభాన్ని బ్రిటీష్ పాలకుల కాలంలో నాటి ఆర్కిటెక్టులు తెలుసుకునే ప్రయత్నంలో వేలాడే స్థంభం కాస్త ఒక పక్కన నేలకు తాకింది. ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులు ఈ విషయం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మీరూ చూడండి… వేలాడే స్థంభం కింద నుంచి ఒక బట్టను ఈ సందర్శకులు ఏ విధంగా అటు నుంచి ఇటు దాటిస్తున్నారో. ఇదీ నాటి నిర్మాణ ప్రత్యేకత.
ఇక ఈ గోడపై నాటి శిల్పి గొప్పదనం ఎంతటిదో చెప్పేందుకు ఈ బొమ్మను చూడండి. ఒకే జంతువు. శరీరం ఒకటే… తలలు మూడు. మూడు తలల్లో రెండు తలలు కనిపించకుండా దాచిపెడితే ఆ జంతువు ఒక భంగిమలో దర్శనమిస్తుంది. మరో రెండు తలల్ని దాచిపెడితే మరో భంగిమలో… అలా మూడు రకాల భంగిమల్లో కనిపిస్తుంది. అంటే వేర్వేరుగా ఆ జంతువు నిల్చున్న సమయంలో తీసిన ఫోటో మాదిరిగా కనిపిస్తుంది. ఒకే జంతువు మూడు రకాలుగా ఫోజులిచ్చినట్లు చెక్కిన నాటి శిల్పి గొప్పదనం ఇక్కడ కనిపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. అత్యంత గొప్ప శిల్పకళ నైపుణ్యంతో చెక్కిన నందీశ్వరుడు లేపాక్షి ఆవరణలోకి ప్రవేశించగానే కుడివైపున మనకు దర్శనమిస్తుంది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా గుర్తింపు పొందింది. మరో విశేషమేమిటంటే… సాధారణంగా ఏ నందీశ్వరుని విగ్రహం అయినా ఒక పీఠం మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. కానీ లేపాక్షి లోని బసవన్న మాత్రం ఎలాంటి పీఠం మీద కూర్చోకుండా సాధారణ నేలపైన ఏ విధంగా కూర్చుంటుందో అదే విధంగా ఇక్కడి నందీశ్వరుని విగ్రహాన్ని నిర్మించారు. భారీ ఏడు పడగలు కలిగిన నాగసర్పము శివలింగాన్ని చుట్టినట్లుండే భారీ విగ్రహం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత. ఆలయ ఆవరణలో విలక్షణమైన రాతి శిల్పంతో చెక్కిన వినాయక విగ్రహము మరో ఆకర్షణగా నిలుస్తుంది. వినాయకుడు తన తొండాన్ని ఎడమ వైపుకు వంచి ఉండడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మనం ఇప్పుడు చూస్తున్న ధర్మవరం, ఇతర పట్టు చీరలపై కనిపించే డిజైన్లు 5వందల ఏళ్ల క్రితమే నిర్మితమైన ఆలయ ఆవరణలో కనిపించడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
చూశారుగా… ఇదీ లేపాక్షి విశిష్టిత. శిల్ప కళలోనూ మేటి. సాంకేతికలోనూ మేటి. ఇతిహాసాల్లో చోటు. రాయల కాలంలో ప్రసిద్ది. ఇప్పటికీ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఒకసారి వీలు చూసుకొని దర్శించుకోండి.
Discussion about this post