మాఘమాసంలో ఐదో రోజు జరుపుకునే మరో శుభదినం వసంత పంచమి. వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. దీనినే సరస్వతి పంచమి అని కూడా అంటారు. ఈ శ్రీ పంచమి రోజే చదువులతల్లి సరస్వతీ దేవి పుట్టినట్టు బ్రహ్మ వైవర్త పురాణం చెపుతోంది. యావత్ భారతదేశంలో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు.
ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయాలి . మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది . సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధిస్తారు. సంగీత, నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా ఉంది. అందుకే తమ పిల్లలకి ఈ రోజే అక్షరాభ్యాసం చేయిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇళ్లలోనే కాకుండా స్కూల్స్ , కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సరస్వతి క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. హైదరాబాద్ కి సమీపంలో ఉన్న ఇంకొక క్షేత్రం వర్గల్ సరస్వతి ఆలయం లో కూడా వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కేరళ రాష్ట్రంలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర నెడుంబాసిరిలో ఉన్న ఆవనంకోడ్ సరస్వతి దేవి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారి అక్షరాభ్యాసం జరిగిందని చెబుతారు. పరశురాముడు నిర్మించిన 108 అమ్మవారి ఆలయాల్లో ఇది ఒకటి.
Discussion about this post