మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. షాద్ నగర్ నియోజకవర్గానికి సంబందించి ఎంపిడిఓ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి క్యాంప్ ల నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు బస్సుల్లో తరలివెళ్లారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్ కు అనుమతించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసుల బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేశారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ టీంల ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించారు.
ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు హక్కును స్థానిక సంస్థల ఓటర్లు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కోడంగల్ పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శాసనమండలి ఎన్నిక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల అనంతరం ఎక్స్ – అఫీషియో హోదాలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Discussion about this post