కుదేలైన మాల్దీవుల పర్యాటకం
దౌత్యపరమైన వివాదంతో కుదేలైన మాల్దీవుల పర్యటక సంస్థలు భారతీయులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌లోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇరుదేశాల మధ్య ప్రయాణ, పర్యటక సహకారాన్ని పెంపొందించడంపై మాల్దీవుల ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్ల సంఘం.. మటాటో ప్రతినిధులు మాలేలో భారత హైకమిషనర్‌తో చర్చలు జరిపారు. మాల్దీవులకు భారత్ ఇప్పటికీ కీలకమైన మార్కెట్ అని మటాటో ఈ సందర్భంగా ప్రకటించింది. మాల్దీవులను ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్ ట్రావెల్ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది. పర్యటక సంబంధాలను పెంపొందించడం, ఆ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని మటాటో ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ప్రధాని మోదీ ప్రభావంతో లక్షద్వీప్‌లో సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Discussion about this post