కాంగ్రెస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఫైరయ్యారు. బయటి నుండి వచ్చిన మైనంపల్లి రౌడీయిజంతో కాలేజీలో దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేశారని ప్రీతి రెడ్డి ఆరోపించారు. రౌడీలాగా వచ్చి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని తెలిపారు. పొలిటికల్ ఎజెండాతో స్టూడెంట్స్ ని వాడుకుని ధర్నా చేస్తున్నారని.. ఇలాంటి రౌడీయిజాన్ని తాము భరించబోమన్నారు.
యూనివర్సిటీలో 70 వేల మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రీతి రెడ్డి అన్నారు. హాస్టల్స్ ఫుడ్లో పురుగులు వస్తే.. వాటిని తాము సరిచేస్తామన్నారు. కాలేజీలో ఉన్న ప్రాబ్లమ్స్ తమ దగ్గరికి తీసుకురావాలి.. అంతే తప్ప ధర్నాలు చేయొద్దన్నారు. స్టూడెంట్స్ పై తమకు ఎలాంటి కక్ష్య లేదన్నారు. తాము చదువు చెప్పడానికి యూనివర్సిటీ పెట్టామని.. ప్రభుత్వ జీవోల ప్రకారమే యూనివర్సిటీని నడుపుతున్నామని తెలిపారు. డిటైన్ సిస్టమ్ అనేది అన్ని కాలేజీల్లో ఉంటుందని చెప్పిన ప్రీతి రెడ్డి.. 25 మంది విద్యార్థులను మాత్రమే డిటైన్ చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయం లో నిర్లక్ష్యం వహించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు కాలేజీ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Discussion about this post