పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. ఉమ్మడి జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. నిర్వహణను అయిదేళ్లుగా గాలికి వదిలేశారు. రబీ సాగు ముగిసిన తరువాత కాలువలు, లాకులు, షట్టర్లు, ఇతర నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఏటా క్లోజర్ సమయంలో లాకులు, షట్టర్ల తలుపులకు ఆయిల్పూసి తుప్పు పట్టకుండా రంగులు వేస్తారు. తలుపులు సులభంగా నిర్వహించేందుకు వీలుగా అక్కడి పరికరాలకు గ్రీజు పూస్తారు. లొల్ల వద్దనున్న బ్యాంక్ కెనాల్ లాకుల నుంచి ముక్తేశ్వరం కెనాల్ ద్వారా సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లాకులు పూర్తి శిథిలావస్థకు చేరాయి. షట్టర్లు, రాడ్లకు ఆయిల్, గ్రీజ్ పూయకపోవడం వల్ల తుప్పు పట్టాయి.
Discussion about this post