జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఒక శకం ముగిసింది. మాజీ ప్రధాని, ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఏప్రిల్ 3తో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది.ఆయనకు సంబందించిన విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
ఆర్థిక సంస్కరణల ఆద్యుడైన మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్న ‘గా’ అనే ఊరిలో జన్మించారు. 1980 నుంచి 1982లో ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా.. ఆ తర్వాత 1982లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పని చేశారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితికి చెందిన కాన్ఫిరెన్స్ ఆఫ్ ట్రేడ్ డెవలప్మెంట్లో మెంబర్‌గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్‌కు ఆ సభతో 33 ఏళ్ల అనుబంధం ఉంది.1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అదే ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. అసోం నుంచి రాజ్యసభకు ఎన్నిక అవుతూ వచ్చారు. 2019లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడయ్యాక 1991 – 1996 మధ్య కాలంలో పీవీ నరసింహారావు హయాంలో ఆర్ధిక మంత్రిగా సేవలు అందించారు.
అంతేకాదు దేశానికి అత్యవసరమైన ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారు. 1996లో ఈయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2004 – 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానిగా సేవలు అందించారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా తర్వాత సుధీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్ నేతగా మన్మోహన్ సింగ్ రికార్డు క్రియేట్ చేశారు. మన్మోహన్ సింగ్ స్థానంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారి ఎగువ సభలో అడుగుపెట్టబోతున్నారు. మన్మోహన్ సింగ్ సహా రాజ్యసభలో మొత్తంగా 54 మంది మంగళ, బుధవారాల్లో పదవీ విరమణ చేస్తున్నారు. అందులో 9 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. మన్మోహన్ పదవీ విరమణతో ఒక శకం ముగిసిందని ఆయన అన్నారు. యువత దృష్టిలో మన్మోహన్ హీరోగా మిగిలిపోతారన్నారు. ఎక్స్‌లో ఇందుకు సంబంధించి ఆయన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. “మీరు క్రియాశీల రాజకీయాల నుంచి పదవీ విరమణ చేసినప్పటికీ, తరచూ దేశ పౌరులతో మాట్లాడటం ద్వారా జ్ఞానం పెంపొందించడంతోపాటు నైతిక దిక్సూచిగా నిలవాలని ఆశిస్తున్నా. దేవుడు ఎల్లప్పుడూ శాంతి, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. మీరు దేశానికి చేసిన సేవల గురించి ప్రస్తుత నాయకులు చెప్పడానికి ఇష్టపడరు. కానీ దేశ ప్రజలు మీ సేవల్ని ఎన్నటికీ మర్చిపోరు. మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ మధ్యతరగతి యువతకు హీరో. పారిశ్రామికవేత్తలు, నాయకులకు మార్గదర్శకుడు. మీ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుంచి బయటపడగలిగిన వారెందరో ఉన్నారు” అని ఖర్గే తన పోస్ట్‌లో రాశారు.
Discussion about this post