విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ల కేసును ముంబై హైకోర్టు జూన్ 13 నాటికి వాయిదా వేసింది. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మూడునెలల క్రిందటే అసెంబ్లీలో రిజర్వేషన్లపై ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని నిబంధనతో మరాఠా రిజర్వేషన్ల సమస్య కొలిక్కి రావడం లేదు.
చట్టరూపంలో లేనందువల్ల విద్యాసంస్థలు లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం 10 శాతం మరాఠా కోటా అమలు కాబోదని ముంబై హైకోర్టు తెలిపింది. రాష్ట్ర జనాభాలో మూడొంతుల జనాభా మరాఠాలే కావడంతో రాజకీయంగా మరాఠా కోటా చాలా ముఖ్యం. వాస్తవానికి ఈ రిజర్వేషన్ డిమాండ్ చాలా కాలంగా వస్తోంది. 10 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లుపాస్ అయినప్పటికీ కోర్టు పరిధి నుంచి బయటపడలేకపోతోంది. ఇప్పటికే రెండు సార్లు కోర్టులో ఫెయిల్ అయ్యింది. దీంతో 2024 ఎన్నికల్లో ప్రభుత్వానికి ఇది ముఖ్యమైంది. అయితే లోక్ సభ ఎన్నికల కారణంగా ఆ డిమాండు మరింత ప్రాధాన్యతసంతరించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం అయిన వెంటనే అంటే మార్చి 1న ఈ బిల్లును ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కేసు దాఖలైంది.
2018లో ఇటువంటి కేసునే హై కోర్టు కొట్టివేయడంతో 2021లో సుప్రీం మెట్లెక్కారు. రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర ఇచ్చిన తీర్పునే సమర్థించింది. వాస్తవానికి జస్టిస్ సునీల్ షుక్రే నేతృత్వంలో మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదిక ప్రకారం మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగ వెనుకబడి ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. 2018 వరకు అంటే ఆరేళ్లలో మరాఠాల్లో బాల్య వివాహాలు 0.32 నుంచి 13.7 శాతం వరకు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం తగ్గిపోయిందని నివేదిక వెల్లడించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో 2018 నాటికి 14.63 శాతం ఉండగా, 2024 నాటికి 9 శాతానికి పడిపోయిందని తెలిపింది. మరాఠాలు ప్రధాన స్రవంతిలో లేకుండా పూర్తిగా వెనుకబడిపోయారని రిటైర్డ్ జస్టిస్ ఎం జీ గైక్వాడ్ నివేదిక కూడా తెలిపింది.
జస్టిస్ గైక్వాడ్ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టు ప్రాతిపదికగా తీసుకుంది. రెండు గ్రామాలకు చెందిన 43, 629 కుటుంబాలపై సర్వే చేసి, 355 తాలూకాల్లో మరాఠాలు 50 శాతానికి మించి నివసిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. రాష్టంలోని 1 కోటి, 58 లక్షల, 20 వేల 264 కుటుంబాలను షుక్రా కమిషన్ సర్వేచేసింది. రాష్ట్రంలో వారి జనాభా 28 శాతం గా ఉందని తెలిపింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న ఇంద్రసాహ్నే తీర్పును అధిగమించాలంటే పార్లమెంటులో మరాఠీ రిజర్వేషన్ పై బిల్లు పాస్ చేయాల్సి ఉంది. మహారాష్ట్రలో మొదట 52 శాతం రిజర్వేషన్లు ఉండేవి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా 10 శాతం, ప్రస్తుతం మరాఠాలకు 10 శాతంతో మొత్తం రిజర్వేషన్లు 72 శాతానికి పెరుగుతాయి.
Discussion about this post