Christmas Celebrations: వందేళ్లయినా చెక్కుచెదరని అద్భుత కట్టడం
ఆసియా ఖండంలోనే అతి పెద్దదయిన మెదక్ కేథడ్రల్ చర్చి .. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతోంది. 1924 డిసెంబర్ 25న ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకున్న ఈచర్చిలో క్రైస్తవ మత పెద్దలు నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు. ఈసారి శత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించాలని నిర్ణయించారు.
దక్షిణ భారతదేశంలో పర్యాటకులు ఎక్కువగా సందర్శించేవాటిలో మెదక్ చర్చి ప్రధానమైనది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో తీవ్రంగా కరువు సంభవించి ప్రజలంతా ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో ఇంగ్లాండ్ కు చెందిన రెవరెండ్.
“చార్లెస్ వాకర్ ఫాస్నెట్ ” పనికి ఆహరం పథకంతో చర్చి నిర్మాణం చేపట్టారు. చర్చి నిర్మాణంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి “మెతుకులు” అందజేస్తామని ప్రకటించారు. అందుకే ఈ ప్రాంతానికి “మెదక్” అని “మెతుకు సీమ” అని పేరు వచ్చింది.
1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 వరకు కొనసాగింది. అదే సంవత్సరం డిసెంబర్ 25న దీనిని ప్రారంభించారు. వాస్తుశిల్పి “ఎడ్వర్డ్ హార్డింగ్” ఆధ్వర్యంలో చర్చి నిర్మాణం జరిగింది. చర్చి నిర్మాణానికి వినియోగించిన ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండు నుండి, మేస్త్రీలను ముంబై నుండి తెప్పించారు. మొజాయిక్ పలకలను బ్రిటన్ నుండి., పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు.
బూడిద రాయితో నిర్మించిన భారీ స్తంభాలు చర్చి లోపలి భాగంలోని గ్యాలరీకి చక్కటి అందాన్ని తెచ్చిపెట్టాయి. చర్చి పైకప్పును బోలు స్పాంజి పదార్థంతో సౌండ్ ప్రూఫ్ గా తయారు చేయించారు. బెల్ టవర్ ఎత్తు 175 అడుగులు. కొన్ని మైళ్ల దూరం నుండి ఇది కనిపిస్తుంది. చర్చిలో ఒకేసారి ఐదు వేల మంది ప్రార్ధన చేసుకునే అవకాశం ఉంది. క్రిస్మస్ వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లను చర్చి నిర్వాహకులు ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి దయానంద్ కు వివరించారు.
Discussion about this post