హిందూ పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిది శ్రీ మహా విష్ణువు ఏకవింశతి అవతారాల్లో ఆరవ అవతారం. దత్తుడి ఈ రూపం అసాధారణమైనది. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు ఉంటాయి. నడిమి శిరస్సు విష్ణువుది… కుడిది శివుడిది.. ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగం సద్గురు స్వరూపం. ఎడమ భాగమం పర బ్రహ్మస్వరూపము.. మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానాన్ని తొలగించి శ్రీదత్తుడు లోక రక్షణ చేస్తాడు.
మూడు ముఖాలతో.. ఆరు భుజాలు, నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదాలు కాగ, ఆవు మనస్సే మాయాశక్తి… మూడు ముఖాలు త్రిమూర్తులుగా సృష్టి, స్థితి, లయాలకు సంకేతంగా ఉంటుంది. త్రిశూలం ఆచారము.. చక్రం అవిద్యా నాశకం.. శంఖా నాదం సమస్త నిధి. ఢమరుకం నుంచే సర్వవేదాలు ఉద్భవించాయి. కమండలం.. సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటానికి ప్రతీక. తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీ నది గట్టున కూర్చుని శివుని ప్రార్థించాడని.. చివరకు బ్రహ్మజ్ఞానం అంటే శాశ్వత జ్ఞానం పొందాడని బ్రహ్మ పురాణం చెబుతోంది. దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆది సిద్ధుడుగా గుర్తించబడ్డాడు. కార్తవీర్యుడు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి అనేక పురాణ పురుషులకు ఆధ్యాత్మిక విద్యను బోధించిన మహా మహిమాన్వితుడు దత్తాత్రేయుడు.
ఈ అవతారం విశిష్టమేమంటే, విష్ణు మూర్తి మిగతా అవతారాలకు వారివారి కార్యాలు తీరగానే సమాప్తి ఉంటుంది. కానీ నారదుని తర్వాత ఎప్పటికీ అవతార సమాప్తి లేనిది దత్తాత్రేయ అవతారనికే. నారదుడు తన కార్యంలో భాగంగా వైష్ణవ ధర్మాన్ని భోదిస్తూనే ఉంటారు. అలాగే, దత్తాత్రేయుడు కూడా సర్వజనోద్ధరణ కోసం అవతరించారు కనుక.. భూమిపై ప్రజలున్నంతవరకూ ఆయన సంచరిస్తూనే ఉంటారు… భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటారు. దత్తక్షేత్రాలలో గాణ్గాపురం, కురువాపురం, పిఠాపురం క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. ఈక్షేత్రాలు మనకు అందుబాటులో ఉండటం మన అదృష్టం.
దత్తాత్రేయుడు 16 అవతారాలు ధరించినట్లు చెబుతారు. యోగిరాజ్, అత్రివరద, దత్తాత్రేయ, కాలాగ్నిశమన, యోగిజనవల్లభ, లీలావిశ్వంభరుడు, సిద్ధరాజ్, జ్ఞానసాగర, విశ్వంభరావధూత, మాయాముక్తావధూత, మాయాయుక్తవధూత, ఆదిగురు, శివరూప, దేవదేవా, దిగంబర, కృష్ణశ్యామ కమలనయన అవతారాలుగా చెబుతారు.
Discussion about this post