మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ కాన్వెంట్ కూడలి వద్ద ఉన్న జ్ఞానాపురం శ్మశాన వాటికలో అర్ధరాత్రి హిజ్రాలతో కలిసి అఘోరా నిర్వహించిన పూజలు అబ్బురపరిచాయి. హరహర మహాదేవ అంటూ హిజ్రాలు చేసిన శివ నామస్మరణతో శ్మశానవాటిక దద్దరిల్లింది.
సాధారణంగా మహా శివరాత్రి రోజున ఆలయాల్లో శివలింగాలకు పూజలు అభిషేకాలు చేయడం చూస్తుంటాం. కానీ విశాఖలో మాత్రం ఇందుకు బిన్నంగా ఏటా మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో శ్మశాన వాటికలోని శివుని విగ్రహానికి కపాలాల హారం ధరించిన అఘోరాతో కలిసి శివపార్వతులకు ప్రతి రూపమైన ట్రాన్స్ జెండర్స్ అభిషేకం చేస్తారు. ఈ ఏడాది కూడా శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 60 రకాలకుపైగా సుగంధ ద్రవ్యాలతో భోళాశంకరుడి విగ్రహానికి అభిషేకం జరిపించారు. చివరిగా చితి నుండి సేకరించిన చితాభస్మంతో అభిషేకించి స్వామివారి విగ్రహాన్ని శుద్ది చేసి అలంకరించి విగ్రహం ఎదుట హిజ్రాలు నృత్యం చేశారు.
శ్మశాన వాటికకు రాత్రి పూట రావడానికి ప్రతి ఒక్కరు భయపడతారు. కానీ శివరాత్రి రోజున విశాఖలో అలాంటి పరిస్థితి ఉండదు. అఘోరా.. హిజ్రాలు కలిసి అట్టహాసంగా చేసే పూజలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు నిర్భయంగా వస్తారు. ఈ ఏడాదీ అలానే వచ్చారు.
Discussion about this post