ఏపీలో మరో ఎన్నిక జరుగనుంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. ఇక్కడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పై వైసీపీ అనర్హత వేటు వేయడంతో ప్రస్తుతం ఎన్నిక అనివార్యమైంది. ఆగస్టు 30న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
2019 ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నుబోయిన్ వంశీకృష్ణ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆయన గత డిసెంబర్ లో వైసీపీ వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. పార్టీ పిరాయింపు చట్టం కింద శాసనమండలి ఛైర్మన్ వంశీకృష్ణ యాదవ్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వంశీకృష్ణ విశాఖ సౌత్ స్థానం నుంచి విజయం సాధించారు.
ఖాళీగా ఉన్న విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఆగస్టు 30న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిటర్నింగ్ అధికారి, విశాఖ జేసీ కె.మయూర్ అశోక్ ఈ నెల 13వ తేదీ ఉదయం 11గంటల నుంచి మద్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక నామినేషన్ల ఉప సంహరణలకు 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తారు. ఈ నెల 30వ తేదీన స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఉప ఎన్నిక జరిగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మన్సిపల్ కార్పరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అంటే ఉమ్మడి విశాఖ పరిధిలో మొత్తం 841 ఓటర్లు ఉన్నారు. వైసీపీ బలం 615 ఉంటే… టీడీపీ, జనసేన, బీజేపీలకు కలిపి 215 ఓట్లు ఉన్నాయి. మరో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కూటమి నేతలు తమ ఉమ్మడి పార్టీల అభ్యర్థిని నిలిపేందుకు రంగంలోకి దిగారు. ముఖ్య నేతల సమీక్ష తరువాత బరిలో దింపాల్సిన అభ్యర్థి వివరాలను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా కొనసాగిన వంశీకృష్ణ యాదవ్ తాజాగా జరిగిన ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం, కూటమి అధికారానికి రావడంతో రాజకీయ సమీకరణాలు కూడా మారాయి.
సంఖ్యా పరంగా వైసీపీకి ప్రస్తుతం ఎక్కువ ఓట్లు ఉండటంతో తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అయితే ఇటీవలి ఎన్నికల్లో కూటమి అధికారానికి రావడంతో చాలా మంది తమ పార్టీల వైపు వచ్చారని చెబుతోన్న కూటమి నాయకులు ఎన్నిక నాటికి మరింత మంది తమ పార్టీల్లో చేరుతారని, ఎమ్మెల్సీ స్థానాన్ని తామే కైవసం చేసుకుంటామని చెబుతున్నారు. అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య విశాఖ ఎమ్మెల్సీ స్థానం కీలకం కానుంది.
Discussion about this post